రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై బూర నర్సయ్య గౌడ్, ఈటల రాజేందర్ స్పందన

  • రాజగోపాల్ రెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో.. ఆత్మ కాంగ్రెస్‌లోనే ఉందన్న నర్సయ్య
  • బీఆర్ఎస్‌కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమన్న మాజీ ఎంపీ
  • రాజగోపాల్ రెడ్డి రాజీనామాను చూడలేదన్న ఈటల రాజేందర్
  • మొన్ననే బీజేపీయే ప్రత్యామ్నాయమని అంతలోనే మాట ఎలా మార్చారు? అని ప్రశ్న
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వేర్వేరుగా స్పందించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖను తాను ఇంకా చూడలేదని ఈటల అన్నారు. మొన్ననే బీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పిన ఆయన ఇప్పుడు మాట ఎలా మార్చారు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ గురించి ఈటల మాట్లాడుతూ... అధికార పార్టీ డబ్బు సంచులను మాత్రమే నమ్ముకున్నదని, తాను వారి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. హుజూరాబాద్, గజ్వేల్... రెండు నియోజకవర్గాల్లో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

రాజగోపాల్ రెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో... బూర నర్సయ్య గౌడ్

రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన శరీరం మాత్రమే బీజేపీలో ఉందని, కానీ ఆత్మ కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయిందని బూర నర్సయ్య గౌడ్ దెప్పిపొడిచారు. ఆయన బీజేపీకి రాజీనామా చేయడం బ్రేకింగ్ న్యూస్ ఏమీ కాదని, అందరూ ఊహించిందే అన్నారు. రాజగోపాల్ రెడ్డి చెప్పినంత మాత్రాన బీఆర్ఎస్‌కు తమ పార్టీ ప్రత్యామ్నాయం కాకుండా పోదన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కేసీఆర్‌ను ప్రగతి భవన్ నుంచి పంపించివేయాలని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అన్నారు.

తన పోటీ గురించి మాట్లాడుతూ... పార్టీ అధిష్ఠానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేసేందుకు తాను సిద్ధమని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తనకు వ్యక్తిగతంగా లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని ఉందని, కానీ పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.


More Telugu News