డ్రామారావు... నిన్న మేం ఎలక్షన్ కమిషన్‌కు చెప్పింది ఇదే: కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్

  • ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు... అంటూ కేటీఆర్‌కు రేవంత్ చురకలు
  • మీకు అంత ప్రేమ ఉంటే నవంబర్ 2లోపు లబ్ధిదారులకు నిధులివ్వాలని డిమాండ్
  • నీలాంటి వాడిని చూసే నిజం చెప్పులేసుకునే లోపు అబద్దం ఊరంతా తిరిగి వచ్చిందనే సామెత పుట్టిందని ఎద్దేవా
రైతుబంధు ఆపేయాలంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శలు గుప్పించడంపై అదే ఎక్స్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్‌కు రైతులపై అంత ప్రేమ ఉంటే నవంబర్ 2లోపు రైతు బంధు, పెన్షన్, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

'ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు... నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2 లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు... నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపు ఫించన్ ఇవ్వు...
నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు... నిన్న మేం ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది ఇదే...' అని రేవంత్ పేర్కొన్నారు.

నీలాంటి వాడిని చూసే... 'నిజం చెప్పులు తొడుక్కునే లోపు... అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది' అనే సామెత పుట్టిందని విమర్శించారు. కేటీఆర్, బీఆర్ఎస్ తమ డ్రామాలు ఆపి నవంబర్ 2 లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వాలని సూచించారు. లేదంటే కాంగ్రెస్ వచ్చి పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుందని వ్యాఖ్యానించారు.


More Telugu News