ఫిలిం డైరెక్టర్ రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు

  • రికార్డింగ్, రీరికార్డింగ్ థియేటర్ల నిర్మాణం కోసం భూమి కేటాయింపు 
  • వాణిజ్య అవసరాలకు వాడుకున్నారంటూ 2012లో పిల్
  • ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినా రికార్డుల్లో నమోదు కాని వైనం
  • తాజాగా మరోసారి రాఘవేంద్రరావు, ఆయన బంధువులకు హైకోర్టు నోటీసులు
సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన రికార్డింగ్, రీరికార్డింగ్ థియేటర్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని దర్శకుడు రాఘవేంద్రరావు సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. రాఘవేంద్రరావుకు, ఆయన బంధువులకు మరోసారి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ప్రాంతంలో 2 ఎకరాలను ప్రభుత్వం  ఆయనకు  కేటాయించింది. కాగా, ఈ పిటిషన్‌పై కోర్టు గతంలో ఓమారు నోటీసులు జారీ చేసినా, అవి వారికి అందినట్లుగా రికార్డుల్లో లేకపోవడంతో గురువారం మళ్లీ నోటీసులు ఇచ్చింది. అనంతరం, విచారణను న్యాయస్థానం జనవరి 18కి వాయిదా వేసింది. 

మెదక్‌కు చెందిన బాలకిషన్ అనే వ్యక్తి 2012లో ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సర్వే నెం.403/1లోని 2 ఎకరాల భూమిని వాణిజ్య అవసరాలకు (ఆర్కే సినీప్లెక్స్) వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అలోక్ అరథే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్‌లతో కూడిని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతివాదులైన రాఘవేంద్రరావు, ఆయన బంధువులు కృష్ణమోహన్ రావు, చక్రవర్తి, విజయలక్ష్మి, అఖిలాండేశ్వరి, లాలస దేవికి నోటీసులిచ్చింది.


More Telugu News