రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడన్న పాక్ మాజీ ఆటగాడు... మండిపడ్డ వసీం అక్రమ్

  • ప్రతిసారీ టాస్ టీమిండియాకు అనుకూలంగా ఉంటోందన్న సికిందర్ భక్త్
  • దారుణమైన వ్యాఖ్యలు అంటూ స్పందించిన వసీం అక్రమ్
  • ఇలాంటి వ్యాఖ్యలపై స్పందించడం కూడా అనవసరం అని వెల్లడి
రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడన్న పాక్ మాజీ ఆటగాడు... మండిపడ్డ వసీం అక్రమ్
భారత్ ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టేసరికి ఆ దేశ మాజీ క్రికెటర్లు టీమిండియాపై కుత్సిత బుద్ధితో వ్యాఖ్యలు చేస్తున్నారు. టీమిండియా ఆడే మ్యాచ్ ల్లో ప్రత్యర్థి జట్లకు ఒకవిధమైన బంతిని ఇస్తూ... టీమిండియాకు అదనపు పూత ఉన్న బంతిని ఇస్తున్నారంటూ పాక్ మాజీ ఆటగాడు హసన్ రజా వ్యాఖ్యానించడం తెలిసిందే. 

రజా కోవలోనే మరో పాక్ మాజీ ఆటగాడు సికిందర్ భక్త్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నాడని ఆరోపించాడు. రోహిత్ శర్మ టాస్ వేసేటప్పుడు నాణెం దూరంగా పడేలా విసురుతున్నాడని, దాంతో ప్రత్యర్థి కెప్టెన్లు వెళ్లి ఆ నాణెం బొమ్మ పడిందో, బొరుసు పడిందో తెలుసుకునే వీల్లేకపోతోందని భక్త్ వివరించాడు. టాస్ ను పర్యవేక్షించే ఐసీసీ అధికారులను కూడా మేనేజ్ చేస్తున్నారని ఆరోపించాడు. దాంతో ప్రతిసారీ టాస్ నిర్ణయం టీమిండియాకు అనుకూలంగా వస్తోందని సూత్రీకరించాడు. 

సికిందర్ భక్త్ వ్యాఖ్యలపై పాక్ స్వింగ్ దిగ్గజం వసీం అక్రమ్ స్పందించాడు. భక్త్ వాదనలు దారుణంగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. "టాస్ కు ఉపయోగించే నాణెం కచ్చితంగా ఇంత దూరంలోనే పడాలి అని ఎవరు చెప్పగలరు? టాస్ వేసిన నాణెం ఓ మ్యాట్ పై పడుతోందని అంటున్నారు... ఆ మ్యాట్ స్పాన్సర్ షిప్ కోసం ఉపయోగిస్తుంటారు. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు వినలేకపోతున్నాను. అసలు ఇలాంటి వ్యాఖ్యలపై స్పందించడం కూడా అనవసరం" అని అక్రమ్ పేర్కొన్నాడు. 

పాక్ మాజీ సారథులు మొయిన్ ఖాన్, షోయబ్ మాలిక్ కూడా సికిందర్ భక్త్ ఆరోపణలను ఖండించారు. ఒక్కో కెప్టెన్ ఒక్కో శైలిలో టాస్ వేస్తుంటారని మొయిన్ ఖాన్ తెలిపాడు. దీనిపై చర్చించడం కూడా దండగేనని షోయబ్ మాలిక్ వెల్లడించాడు.


More Telugu News