పోటీ చేసిన అన్ని చోట్లా డిపాజిట్ కోల్పోయిన జనసేన, సీపీఎం

  • ఈ ఎన్నికల్లో 8 స్థానాల నుంచి బరిలోకి దిగిన జనసేన
  • ప్రచారం చేసిన పవన్ కల్యాణ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
  • పోటీ చేసిన 19 స్థానాల్లోనూ డిపాజిట్ కోల్పోయిన సీపీఎం
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన దారుణ ఓటమి పాలైంది. బీజేపీతో కలిసి బరిలోకి దిగిన జనసేన తొలుత 11 స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. చివరికి 8 స్థానాలకు పరిమితమై కూకట్‌పల్లి, తాండూరు, కోదాడ, నాగర్‌కర్నూలు, ఖమ్మం, కొత్తగూడెం, వైరా (ఎస్టీ), అశ్వారావుపేట (ఎస్టీ) స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. వీరికోసం పార్టీ అధ్యక్షుడు పవన్ ప్రచారం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూకట్‌పల్లిలో ప్రచారం చేశారు. అయినప్పటికీ అందరూ ఓటమి పాలయ్యారు. అంతేకాదు, ఏ ఒక్కరూ డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. 

కూకట్‌పల్లి నుంచి పోటీచేసిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ ఒక్కరే 39,830 ఓట్లు సంపాదించుకోగలిగారు. మిగతా వారందరూ 5 వేల లోపు ఓట్లకు పరిమితమయ్యారు. తాండూరులో జనసేన అభ్యర్థికి 4,087 ఓట్లు పోలవగా, కోదాడలో 2,151, నాగర్‌కర్నూలులో 1,955, ఖమ్మం 3,053, వైరా 2,712, వైరా 2,712, కొత్తగూడెం 1,945, అశ్వారావుపేట అభ్యర్థికి 2,281 ఓట్లు పోలయ్యాయి.

ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన సీపీఎం పోటీ చేసిన 19 స్థానాల్లోనూ డిపాజిట్ కోల్పోయింది. అంతేకాదు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వంటి కీలక నేతలు కూడా డిపాజిట్ కోల్పోయారు.  సీపీఎం తొలుత కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినా పొత్తు చర్చలు ఫలించకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగి ఓటమి పాలైంది.


More Telugu News