బురదలో దిగబడిపోయిన అంబులెన్స్.. గర్భిణి కడుపులో శిశువు మృతి

  • మిగ్‌జాం వర్షాల కారణంగా ములుగు జిల్లాలో పలుచోట్ల వర్షాలు 
  • మట్టి రోడ్లన్నీ బురదతో చిత్తడిగా మారిన వైనం
  • కోయగూడ ఎల్లాపూర్‌కు చెందిన గర్భిణిని అంబులెన్స్‌లో తరలిస్తుండగా విషాద ఘటన
మిగ్‌జాం తుపానుతో కురిసిన అకాల వర్షాలు ములుగు జిల్లాకు చెందిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చాయి. గర్భిణిని తరలిస్తున్న అంబులెన్స్.. వానకు చిత్తడిగా మారిన రోడ్డులో కూరుకుపోవడంతో మహిళ కడుపులోని బిడ్డ మృతి చెందింది. 

గత కొన్ని రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ బురదతో చిత్తడిగా మారాయి. కాగా,  కోయగూడ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎనిగంటి రమ్యకు పురిటి నొప్పులు మొదలవుతుండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌ను పిలిపించారు. అయితే, రాంనగర్ నుండి కమలాపురం వెళ్లేదారిలో వాహనం బురదలో కూరుకుపోయింది. దీంతో, స్థానికులు వాహనాన్ని ట్రాక్టర్ సాయంతో బయటకు తీశారు. ఈ క్రమంలో మహిళలను ఆసుపత్రికి తరలించడంలో చాలా ఆలస్యం జరగడంతో ఆమె కడుపులోని శిశువు ఉమ్మనీరు మింగి మృతిచెందింది. 

ఈ ఘటనతో మహిళ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. రోడ్ల నిర్వహణ సరిగ్గా ఉండి ఉంటే ఈ విషాదం జరిగి ఉండేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలుగా రోడ్ల నిర్మాణం పనులు పూర్తి చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.


More Telugu News