రేవంత్ రెడ్డి సీఎం అయితే టీడీపీ సిగ్గులేకుండా సంబరాలు చేసుకుంది: కొడాలి నాని

  • బీజేపీ, జనసేన కలిస్తే తెలంగాణలో ఏమైందో చూశాం.. ఏపీలోనూ అదే పరిస్థితి అన్న నాని
  • ఎమ్మెల్యే అయ్యేందుకు పవన్ కల్యాణ్, ప్రతిపక్షంలోకి వచ్చేందుకు చంద్రబాబు కలిశారని ఎద్దేవా
  • హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేదన్న మాజీ మంత్రి కొడాలి నాని
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - జనసేన కూటమి కేవలం ఎనిమిది స్థానాల్లో గెలిచింది. ఎనిమిది చోట్లా బీజేపీయే గెలిచింది. జనసేన పోటీ చేసిన ఎనిమిది చోట్ల ఒక్కసీటు గెలవలేదు. 64 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ 39 స్థానాలు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జనసేన, బీజేపీ కూటమి పరాభవంపై వైసీపీ నేత కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలంగాణలో చూశామన్నారు. ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని జోస్యం చెప్పారు.

టీడీపీ ఏపీలో అధికారంలోకి రావడానికి జనసేనతో కలవలేదని, ప్రతిపక్షంలో కూర్చునేందుకు కలిశారని ఎద్దేవా చేశారు. అదే సమయంలో తాను ఎమ్మెల్యే కావాలనుకుంటే టీడీపీతో కలవాల్సిందేనని జనసేనాని అనుకుంటున్నారని చురకలు అంటించారు. ఎమ్మెల్యేగా గెలిచేందుకు పవన్ కల్యాణ్, ప్రతిపక్షం కోసం చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారన్నారు. వీరిద్దరు కలిసి జగన్ వెంట్రుక కూడా పీకలేరన్నారు. జగన్ సింహం మాదిరి సింగిల్‌గా వస్తారన్నారు. జగన్ మీద ఏపీలో ఎలాంటి వ్యతిరేకత లేదని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. చంద్రబాబు ఓ 420 అని విమర్శించారు. 

తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే టీడీపీ వాళ్లు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారని, గెలిస్తే తమ వారు అని, ఓడితే కాదని అనడం వారికి అలవాటే అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో సెటిలర్స్ కొంతమంది మాట్లాడుతూ.. కేసీఆర్‌ను ఓడిస్తామని శపథాలు చేశారని, కానీ హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటూ గెలుచుకోలేదని గుర్తు చేశారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పార్టీని పెడితే... టీడీపీ వాళ్లు సిగ్గులేకుండా గాంధీ భవన్‌కు వెళ్లి టీడీపీ జెండాలు ఎగురవేశారని మండిపడ్డారు. కేసీఆర్ కూడా చంద్రబాబు శిష్యుడేనని ఒక శిష్యుడు పోయి రెండో శిష్యుడు సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాదిరి పాలన చేస్తే ఒకేసారి అధికారంలోకి వస్తారన్నారు.


More Telugu News