8 సీట్లు గెలిచి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వణుకు పుట్టిస్తున్నాం: ఈటల రాజేందర్

  • గజ్వేల్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఈటల
  • అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని విమర్శ
  • లోక్ సభ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలుస్తామన్న ఈటల
  • మోదీ ఎప్పుడూ పథకాలు నావే అనలేదు... కానీ కేసీఆర్ తానే ఇస్తున్నట్లు చెప్పారని ఆగ్రహం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలను గెలుచుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వణుకు పుట్టిస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే ఉంటే ప్రజలు, ధర్మం, న్యాయం గెలిచేవని వ్యాఖ్యానించారు. గతంలో ఇక్కడ బీజేపీకి కేవలం 1,400 ఓట్లు వచ్చాయని, కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో వందలమంది కార్యకర్తలు తయారయ్యారన్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించినవని, రేపు జరగబోయే ఎన్నికలు నరేంద్రమోదీకి సంబంధించినవని గుర్తు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తానే ఇస్తున్నానని.. తామే చేస్తున్నామని ఏ పథకాన్ని ప్రధాని మోదీ తన క్రెడిట్‌లో వేసుకోలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇస్తోందని మాత్రమే ప్రధాని ఎప్పుడూ చెబుతారన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఏ పథకాన్ని అయినా తానే ఇస్తున్నట్లు కేసీఆర్ చెప్పేవారని గుర్తు చేశారు.

'కేసీఆర్ ఏమైనా ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నాడా? నీయబ్బ జాగీరా? అని ఎన్నోసార్లు ప్రశ్నించాం. మొన్న జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గెలిస్తెనే ఏ స్కీములైనా వస్తాయని, పెన్షన్‌లు, కల్యాణలక్ష్మీ ఉంటాయని, రియల్ ఎస్టేట్ ఉండాలంటే కేసీఆర్ ఉండాలని బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు' అని ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు.


More Telugu News