ఎన్‌‌సీసీ కోటాపై ప్రభుత్వ నిర్ణయం కరెక్టే.. పోలీసు ఉద్యోగాల భర్తీ కేసులో హైకోర్టు తీర్పు

  • ఎన్‌‌సీసీ కోటాను సమానంగా పరిగణించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు సమర్థన
  • అభ్యర్థుల అర్హతను నిర్ణయించే హక్కు పోలీస్ నియామక మండలికి ఉందని స్పష్టీకరణ
  • సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమర్థనీయమన్న కోర్టు
పోలీసు ఉద్యోగాల భర్తీలో ఎన్‌సీసీ కోటాను ఏ, బీ, సీ సర్టిఫికేట్ల వారీగా కాకుండా అన్నిటినీ సమానంగా పరిగణించేలా జీవో 14 జారీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు తాజాగా సమర్థించింది. ఈ జీవోను సవాల్ చేస్తూ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ, ఎస్సై, అగ్నిమాపక శాఖ, డిప్యూటీ జైలర్ నియామక ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఈ జీవో జారీ చేసింది. 

కాగా, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమర్థనీయమని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి. వినోద్ కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. నియామక నోటిఫికేషన్‌లో ఏ, బీ, సీ సర్టిఫికేట్లను సమానంగా పరిగణిస్తామని ఉందని కోర్టు చెప్పింది. ఏ కంటే బీ, బీ కంటే సీ క్యాటగిరీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోం శాఖ జారీ చేసిన సర్క్యులర్ కేవలం సూచన మాత్రమేనని చెప్పింది. 

పిటిషనర్లు ప్రాథమిక, శారీరక దారుఢ్య పరీక్షల్లో విఫలమైనట్టు తెలుసుకున్నాకే నియామక నోటిఫికేషన్‌ను సవాల్ చేశారని తప్పుబట్టింది. సర్టిఫికేట్ ఉన్న వారి అర్హతను నిర్ణయించే అధికారం పోలీస్ నియామక మండలి పరిధిలోనే ఉందని తేల్చి చెప్పింది. 2015 నాటి నోటిఫికేషన్‌లో అమలు చేయలేదని పిటిషనర్లు చెప్పడం సమర్థనీయం కాదని పేర్కొంది.


More Telugu News