ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. రెండుమూడు నెలల్లో వేట మొదలెడతా.. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

  • మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతానన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి
  • జేసీ కుటుంబం, వారి వెంట తిరిగే వారిని లక్ష్యంగా చేసుకుంటానని హెచ్చరిక
  • దారినపోయే వారు రాళ్లేస్తుంటే ఓపిక నశించిపోయిందన్న వైసీపీ ఎమ్మెల్యే
  • మళ్లీ పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ హెచ్చరికలు
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ తర్వాత రెండుమూడు నెలల్లో వేట మొదలెడతానని, జేసీ కుటుంబం, వారి వెంట తిరిగే కొంతమందిని లక్ష్యంగా చేసుకుంటానంటూ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురం ఆర్అండ్‌బీ అతిథిగృహంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతానని, తనలోని పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ జేసీ కుటుంబాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

జేసీ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తాను అవినీతికి పాల్పడినట్టు కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని, ఇకపై ఇలాంటి వాటిని సహించబోనని తేల్చి చెప్పారు. ప్రజలందరినీ భయపెట్టాలన్నది తన ఉద్దేశం కాదన్న ఆయన జేసీ కుటుంబం, వారి వెంట తిరిగే కొందరిని లక్ష్యంగా చేసుకుంటానని తెలిపారు. 

ఇది సమయం కాదనే ఊరుకున్నానని, ఎన్నికలయ్యాక మాత్రం పంటకు పురుగు పడితే తీసేసినట్టు ఏరిపారేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. 1985 నుంచి 2004 వరకు ఎలా ఉన్నానో ఆ రూపాన్ని చూస్తారని పేర్కొన్నారు. దారినపోయే ప్రతి ఒక్కరు రాయి వేస్తుంటే ఓపిక నశిస్తోందన్నారు. పాత జీవితంలోకి మళ్లీ వెళ్లాలన్న ఆలోచన ఉందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.


More Telugu News