నాలుగేళ్ల తర్వాత విశాఖలో టెస్టు మ్యాచ్... రోజుకు 2 వేల మంది విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ

  • భారత పర్యటనకు వస్తున్న ఇంగ్లండ్ జట్టు
  • టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్
  • ఫిబ్రవరి 2 నుంచి విశాఖలో రెండో టెస్టు
  • వేదికగా నిలుస్తున్న ఏసీఏ స్టేడియం
విశాఖలోని ఏసీఏ క్రికెట్ మైదానంలో నాలుగేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ జరగనుంది. టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండో టెస్టుకు విశాఖ నగరం ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు జరగనుంది. 

ఈ నేపథ్యంలో, ఆంధ్రా క్రికెట్ సంఘం అపెక్స్ కౌన్సిల్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు రోజుకు 2 వేల మంది విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. 

ఈ మ్యాచ్ నిర్వాహణ కోసం అపెక్స్ కౌన్సిల్ ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్ గా జిల్లా కలెక్టర్ ఏ.మల్లికార్జునరావు వ్యవహరిస్తున్నారు. ఇవాళ మ్యాచ్ నిర్వాహక కమిటీ ఏసీఏ స్టేడియంలో సమావేశమైంది. ఈ సమావేశానికి అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథరెడ్డి కూడా హాజరయ్యారు. టీమిండియా-ఇంగ్లండ్ టెస్టు కోసం టికెట్ల విక్రయం జనవరి 15న ప్రారంభవుతుందని గోపీనాథరెడ్డి వెల్లడించారు. టికెట్లు పేటీఎం యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయని తెలిపారు. 

కాగా విశాఖలో చివరిసారిగా 2019లో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్టు జరిగింది. ఆ మ్యాచ్ లో టీమిండియా 203 పరుగుల భారీ తేడాతో సఫారీలను చిత్తు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (215) డబుల్ సెంచరీ, రోహిత్ శర్మ (176) భారీ సెంచరీతో విరుచుకుపడిన ఆ మ్యాచ్ లో విశాఖ ఏసీఏ మైదానంలో పరుగులు వెల్లువెత్తాయి. రోహిత్ శర్మ (127) రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీ చేయడం విశేషం. అప్పుడు టీమిండియాకు కోహ్లీ కెప్టెన్. 

ఆ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను 502/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 431 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ డీన్ ఎల్గార్ (160), క్వింటన్ డికాక్ (111) సెంచరీలు నమోదు చేశారు. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 7 వికెట్లతో సత్తా చాటాడు. 

ఇక, రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 323/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా దక్షిణాఫ్రికా జట్టుకు 395 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే టీమిండియా పేసర్ మహ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగగా, జడేజా 4 వికెట్లతో సత్తా చాటాడు. దాంతో దక్షిణాఫ్రికా 191 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. 

ఇప్పుడు ఇంగ్లండ్ తో టీమిండియా టెస్టుకు విశాఖ ఏసీఏ స్టేడియం ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో పిచ్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.


More Telugu News