మేడారం జాతరలో వింత.. పెంపుడు కుక్కకు తులాభారం.. వీడియో ఇదిగో!

  • సమ్మక్క, సారలమ్మకు నిలువెత్తు బంగారం
  • హనుమకొండకు చెందిన కుటుంబం మొక్కు
  • గతేడాది కుక్క ఆరోగ్యం కోసం మొక్కుకున్నట్లు వెల్లడి
మేడారంలో రెండేళ్లకు ఒకసారి కొలువుదీరే వనదేవతలకు భక్తులు బంగారం (బెల్లం) తో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ.. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసమో, కష్టాలు తొలగాలనో కోరుకుంటూ భక్తులు మొక్కుకుంటారు. మేడారం జాతరలో ఆ మొక్కులు తీర్చుకుంటారు. హనుమకొండకు చెందిన బిక్షపతి, జ్యోతి దంపతులు మాత్రం తమ పెంపుడు కుక్క ఆరోగ్యం కోసం మొక్కుకున్నారు. జాతర సందర్భంగా ఆ మొక్కు తీర్చుకున్నారు. పెంపుడు కుక్కకు తులాభారం వేసి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. ఈ తులాభారం ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిక్షపతి, జ్యోతి దంపతులు ప్రేమగా పెంచుకుంటున్న కుక్క ‘లియో’ గతేడాది అనారోగ్యం పాలైంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తిండి కూడా మానేసింది. వైద్యులకు చూపించినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆ కుటుంబం సమ్మక్క సారలమ్మకు మొక్కుకుంది. లియో ఆరోగ్యం కుదుటపడితే వచ్చే జాతరలో నిలువెత్తు బంగారం సమర్పించుకుంటామని మొక్కుకున్నట్లు జ్యోతి చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకు లియో ఆరోగ్యం కుదుటపడిందని, లేచి తిరగడం మొదలు పెట్టిందని వివరించారు. దీంతో ఈ జాతర సందర్భంగా మొక్కు చెల్లించుకున్నట్లు తెలిపారు.



More Telugu News