కాకినాడలో దారుణం.. పెళ్లి రోజునే భార్యను హత్య చేసిన భర్త

  • భార్యపై అనుమానంతో కొంతకాలంగా ఘర్షణలు
  • గురువారం ఉదయం కత్తితో విచక్షణారహితంగా దాడి
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన పోలీసులు
కాకినాడలో గురువారం దారుణం వెలుగుచూసింది. వివాహ వార్షికోత్సవం రోజునే ఓ భర్త తన భార్యను కడతేర్చాడు. కాకినాడలోని పప్పుల మిల్లు ప్రాంతానికి చెందిన బందుల నూకరాజు తన భార్య దివ్యపై (26) కత్తితో విచక్షిణారహితంగా దాడి చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన గురువారం జరిగింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఇద్దరికీ నచ్చజెప్పారు. అయితే గురువారం ఉదయం బయటకు వెళ్లి వచ్చిన నూకరాజు భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. గొడవ జరిగిన కొద్ది సేపటికి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన భార్య దివ్యను వీధిలోనే కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాడు. మెడపై తీవ్ర గాయాలవ్వడంతో ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిందితుడిని అడ్డగించే ప్రయత్నం చేసిన సమీప బంధువు లక్ష్మికి కూడా గాయాలయ్యాయని కాకినాడ ఒకటో టౌన్ సీఐ సురేష్‌బాబు వివరించారు.

కాగా వీరిద్దరూ 2016 ఫిబ్రవరి 29న ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండవ వివాహ వార్షికోత్సవం రోజున ఈ హత్య జరిగింది. అయితే దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని తెలిసిందని పోలీసులు వివరించారు. ఫ్యాబ్రికేషన్‌ కాంట్రాక్టు పనులు చేసే నిందితుడు నూకరాజు.. ఆ  పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్తే రెండుమూడురోజుల తర్వాత ఇంటికి వస్తుండేవాడని, ఈ క్రమంలో కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్నాడని వివరించారు. ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారమని సీఐ సురేష్ బాబు వివరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా నిందితుడు హత్య తర్వాత పోలీసులకు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది.


More Telugu News