విటమిన్ డి ఓవర్ డోస్ తో ప్రాణాపాయం.. నిపుణులు ఏమంటున్నారంటే..!

  • బ్రిటన్ లో 89 ఏళ్ల వృద్ధుడి మృతి
  • విటమిన్ డి లెవెల్స్ 30 ఉంటే చాలంటున్న వైద్యులు
  • చనిపోయిన వృద్ధుడి శరీరంలో 380 ఉందని వెల్లడి
శరీరానికి విటమిన్ డి అవసరమే.. దానికోసం సప్లిమెంట్లు అతిగా తీసుకోవడం మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ డి సప్లిమెంట్ల ఓవర్ డోస్ వల్ల ప్రాణాపాయం లేకపోలేదంటున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు శరీరంలో విటమిన్ డి లెవెల్స్ 30 ఉంటే సరిపోతుందని చెప్పారు. ఉదయం పూట కాసేపు ఎండలో నిల్చోవడం ద్వారా శరీరంలోని విటమిన్ డి నిల్వలను సమతౌల్యం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. తాజాగా బ్రిటన్ లో ఓ వృద్ధుడు విటమిన్ డి సప్లిమెంట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చనిపోయాడని అక్కడి వైద్యులు చెప్పారు.

సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి శరీరంలో విటమిన్ డి నిల్వలు 30 కి కాస్త అటూఇటూగా ఉంటాయని, ఈ వృద్ధుడి శరీరంలో మాత్రం ఏకంగా 380 ఉన్నాయని చెప్పారు. అంతకంటే ఎక్కువే ఉండొచ్చు కానీ ల్యాబ్ లోని పారామీటర్లకు గరిష్ఠంగా అక్కడి వరకే కొలిచే సామర్థ్యం ఉందన్నారు. దీంతో ఆరోగ్యం కోసం రోజూ తీసుకున్న సప్లిమెంట్లే ఆ వృద్ధుడి ప్రాణం తీశాయని నిపుణులు చెప్పారు. మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న విటమిన్ డి సప్లిమెంట్లపై ఎలాంటి హెచ్చరికలు లేకపోవడంతో ఓవర్ డోస్ వల్ల ప్రమాదమని జనాలకు తెలియదన్నారు.

మిగతా మందుల తరహాలోనే విటమిన్ డి సప్లిమెంట్లపైనా హెచ్చరికలు ముద్రించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, బ్రిటన్ వృద్ధుడి మరణానికి విటమిన్ డి ఓవర్ డోస్ కారణంగా ఎదురయ్యే హైపర్ కాల్సీమియాతో పాటు హార్ట్ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా కారణమేనని వైద్యులు వివరించారు.


More Telugu News