తాగేందుకు నీళ్లు అడిగితే చంపేస్తారా?: పవన్ కల్యాణ్

  • పల్నాడు జిల్లాలో దారుణం
  • నీళ్లు పట్టుకునేందుకు వెళ్లిన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపిన వైనం
  • ఈ  ఘటన కలచివేసిందన్న పవన్ కల్యాణ్
  • నా ఎస్టీ, నా ఎస్సీ అనే అర్హత ఈ సీఎంకు లేదంటూ ఆగ్రహం 
మాచర్ల నియోజకవర్గంలోని మల్లవరంలో బాణావత్ సామునిబాయి అనే మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఏపీలో తాగు నీళ్లు పట్టుకునేందుకు కూడా పార్టీల లెక్కలు చూసే పరిస్థితి రావడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. 

పల్నాడు జిల్లాలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బాణావత్ సామునిబాయిని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన కలచివేసిందని తెలిపారు. తాగునీరు పట్టుకునేందుకు ఆమె ట్యాంకర్ వద్దకు వెళ్లడం, అవతలి పార్టీ వారు ఆమెను అడ్డుకోవడం, ఇంట్లో నీళ్లు లేవని ఆమె ప్రాధేయపడినా వినకుండా ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపడం చూస్తే రాష్ట్రంలో ఎలాంటి దుర్మార్గపు పాలన ఉందో అందరూ అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

వైసీపీ వాళ్లే నీళ్లు తాగాలి, వైసీపీ వాళ్లే గాలి పీల్చాలి అనే జీవో ఇవ్వడం ఒక్కటే మిగిలి ఉంది అని పవన్ కల్యాణ్ విమర్శించారు. పంచభూతాలకు కూడా పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. 

మల్లవరం ఘటనపై పోలీసులు నిష్పాక్షికంగా, అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల కిందట ఇదే తరహాలో పల్నాడు జిల్లా నకరికల్లు ప్రాంతంలో ఎస్టీ మహిళలను వైసీపీ నాయకుడు ట్రాక్టర్ తో తొక్కించి చంపేశాడని పవన్ కల్యాణ్ వెల్లడించారు. 

"ఈ పాలకుడు మాట్లాడితే నా ఎస్టీలు, నా ఎస్సీలు అంటాడు. కానీ ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేస్తూ, ఎస్టీ మహిళలను ట్రాక్టర్లతో తొక్కించేస్తూ హత్యాకాండ సాగించేవాళ్లను వెనుకేసుకొచ్చే వ్యక్తికి నా ఎస్టీ, నా ఎస్సీ అనే అర్హత ఉందా?" అని పవన్ కల్యాణ్ నిలదీశారు.


More Telugu News