కెనడాలో అనుమానాస్పద స్థితిలో భారత సంతతి కుటుంబం మృతి!
- కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో ఘటన
- నివాసంలో చెలరేగిన మంటలు.. ముగ్గురు కుటుంబ సభ్యుల సజీవదహనం
- మృతులను రాజీవ్ వరికూ (51), శిల్ప (47), మహెక్ వరికూ (16) గా గుర్తింపు
కెనడాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒంటారియో ప్రావిన్స్‌లో భారత సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. దంపతులతో పాటు వారి కూతురు ఈ నెల 7వ తేదీ రాత్రి బ్రాంప్టన్‌లోని వారి నివాసంలో జరిగిన అగ్నిప్రమాదంలో సజీవ దహనమయ్యారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు.
మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించిన అనంతరం మృతులను రాజీవ్ వరికూ (51), భార్య శిల్ప (47), వారి కుమార్తె మహెక్ వరికూ (16) గా పోలీసులు గుర్తించారు. కాగా, రాజీవ్ ఇంట్లో మంటలు చెలరేగడానికి ముందు పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు ఇరుగుపొరుగు వారు పోలీసులకు చెప్పారు. దీంతో ఈ ఘటనపై అగ్నిమాపక విభాగం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఒంటారియో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.