ఇప్పుడు డిమాండ్ అంతా ఈ ముగ్గురు భామలదే!
- 'సప్తసాగరాలు దాటి'తో మెప్పించిన రుక్మిణీ వసంత్
- 'నేరు' సినిమాతో ఆకట్టుకున్న అనశ్వర రాజన్
- 'ప్రేమలు'తో అలరించిన మమిత బైజు
- యూత్ లో ఫాలోయింగ్ పెంచుకున్న ముగ్గురు బ్యూటీలు
- ఇతర భాషల నుంచి వచ్చిపడుతున్న ఆఫర్లు
ఒకప్పుడు గ్లామర్ పరంగా మెరిస్తేనే ఆడియన్స్ ఆదరించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కథలో కలిసిపోయి నటన పరంగా సహజత్వాన్ని ఆవిష్కరించే కథానాయికలకు ఆడియన్స్ ఎక్కువ మార్కులు ఇస్తున్నారు. అందుకు ఉదాహరణగా సాయిపల్లవిని తీసుకోవచ్చు. అలా సహజంగా నటిస్తూ పాత్రలో ఒదిగిపోతున్న కథానాయికలకు ఇప్పుడు మరింత డిమాండ్ పెరిగిపోవడం విశేషంగా కనిపిస్తోంది. ఆ జాబితాలో రుక్మిణీ వసంత్ .. అనశ్వర రాజన్ .. మమిత బైజు కనిపిస్తున్నారు. రుక్మిణీ వసంత్ .. ఈ మధ్య కాలంలో యూత్ కి నిద్రపట్టకుండా చేసిన పేరు. ఆమె బెంగళూర్ బ్యూటీ. 2019లో కన్నడ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. ఆమె తన ప్రతిభను నిరూపించుకోవడానికి ఎక్కువ కాలం వెయిట్ చేయలేదు. 'సప్తసాగరాలు దాటి సైడ్ A' సినిమా ఘన విజయంతో ఆమె అందరిదృష్టిలో పడింది. ఆ తరువాత వచ్చిన సీక్వెల్ తో ఆమె గ్రాఫ్ మరింతగా పెరిగిపోయింది. చీరకట్టులో మనసులను కొల్లగొట్టిన ఈ సుందరికి ఇప్పుడు వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇక మలయాళంలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు అనశ్వర రాజన్. ఇటీవల వచ్చిన 'నేరు' సినిమా నటిగా ఆమె స్థాయిని అమాంతంగా పెంచేసింది. అన్ని వైపుల నుంచి ప్రశంసలు తెచ్చిపెట్టింది. మోహన్ లాల్ తో కలిసి నటించిన ఈ అమ్మాయి వయసు కేవలం 21 సంవత్సరాలు. ఓటీటీలో వచ్చిన తెలుగు వెర్షన్ చూసిన వాళ్లు ఈ అమ్మాయిని సీనియర్ నటి 'రేవతి'తో పోలుస్తున్నారు. నాజూకుగా కనిపించే ఈ అమ్మాయి, భారీ ఆఫర్లు వస్తున్నా .. కథ నచ్చితేనే ఓకే అంటోందట. అనశ్వర రాజన్ మాదిరిగానే 2017లో అడుగుపెట్టిన మరో మలయాళ హీరోయిన్ మమిత బైజు. అనశ్వర మాదిరిగానే ఈ బ్యూటీ కూడా ఓ 15 సినిమాల వరకూ చేసింది. కానీ రీసెంటుగా వచ్చిన 'ప్రేమలు' ఆమెను నేరుగా తీసుకెళ్లి స్టార్ హీరోయిన్ స్థానంలో కూర్చోబెట్టింది. మమిత చలాకీదనం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. వారి మాతృభాషల నుంచి మాత్రమే కాకుండా ఇతర భాషల నుంచి కూడా ఆఫర్లు వెళుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువ క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్స్ జాబితాలో ఈ ముగ్గురూ ఉంటారని నిస్సందేహంగా చెప్పచ్చు.