బెంగ‌ళూరులో నీటి సంక్షోభం.. హోలీ వేడుక‌ల‌పై న‌గ‌ర నీటి బోర్డు ఆంక్ష‌లు

  • పూల్ పార్టీలు, రెయిన్ డ్యాన్స్‌లకు కావేరి, బోర్‌వెల్ నీటిని వినియోగించ‌రాద‌న్న‌ నీటి బోర్డు
  • ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు ప్రతిరోజూ 75వేల‌ లీటర్ల వ‌ర‌కు మంచి నీటిని స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని వెల్ల‌డి
  • ప్ర‌స్తుతం ప్ర‌తిరోజు 500 మిలియన్ లీటర్ల నీటి కొరతతో స‌త‌మ‌త‌మ‌వుతున్న బెంగ‌ళూరు వాసులు
  • నీటి ఎద్ద‌డి వ‌ల్ల న‌గ‌ర ప్ర‌జ‌లు డిస్పోజబుల్ డిష్‌లలో తిన‌డం, మాల్స్‌లోని టాయిలెట్లను ఉపయోగిస్తున్న వైనం

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగళూరును ప్ర‌స్తుతం తీవ్ర నీటి ఎద్ద‌డి స‌మ‌స్య వేధిస్తోంది. రోజువారీ అవ‌స‌రాల‌కు కూడా జ‌నం నీరులేక‌ ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో హోలీ వేడుక‌ల‌పై బెంగ‌ళూరు న‌గ‌ర నీటి బోర్డు తాజాగా నివాసితుల‌కు కీల‌క సూచ‌నలు చేసింది. హోలీ సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా నిర్వ‌హించే పూల్ పార్టీలు, రెయిన్ డ్యాన్స్‌లకు కావేరి, బోర్‌వెల్ నీటిని ఎట్టిప‌రిస్థితుల్లో వినియోగించవద్దని కోరింది. ఇక నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్‌లకు మాత్రం ప్రతిరోజూ 75వేల‌ లీటర్లకు పైగా మంచి నీటిని స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రుగుతుంద‌ని బోర్డు పేర్కొంది.

"హోలీ అనేది హిందూ సంస్కృతిని చాటిచెప్పే పండుగ. ఇంట్లో జరుపుకోవడం, ఆచార వ్యవహారాలను పాటించడంలో ఎలాంటి సమస్య లేదు. అయితే, రెయిన్ డ్యాన్స్‌లు, పూల్ పార్టీలు వంటి వినోద కార్య‌క్ర‌మాల‌కు ఇది స‌రియైన స‌మయం కాదు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కావేరి, బోర్‌వెల్ నీటిని ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు ఉపయోగించడం నిషేధించడం జ‌రిగింది" అని బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు (బీడ‌బ్ల్యూఎస్ఎస్‌బీ) వెల్ల‌డించింది. అంతేగాక తగినంత వర్షాలు కురవకపోవడం, భూగర్భ జలాలు పడిపోవడంతో నగరవ్యాప్తంగా పలు బోర్లు ఎండిపోయిన నేప‌థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. 

'సిలికాన్ వ్యాలీ'గా పేరొందిన బెంగ‌ళూరు ప్ర‌స్తుతం ప్ర‌తిరోజు 500 మిలియన్ లీటర్ల నీటి కొరతతో తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత కొన్ని వారాలుగా నివాసితులు నీటి ఎద్దడి కార‌ణంగా ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. డిస్పోజబుల్ డిష్‌లలో తిన‌డం, మాల్స్‌లోని టాయిలెట్లను ఉపయోగించాల్సి వ‌స్తుంది.

ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం కబ్బన్ పార్క్ మురుగునీటి శుద్ధి కర్మాగారం నుంచి నీటిని చిన్నస్వామి స్టేడియానికి వినియోగించ‌డం జ‌రుగుతుంద‌ని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థనపై జ‌ల‌మండ‌లి చైర్మన్ రామ్ ప్రసాద్ మనోహర్ తెలిపారు. అలాగే భూగర్భజలాలు, కావేరీ జలాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు.. తాగునీటిని కాపాడుతూనే శుద్ధి చేసిన నీటిని సరైన రీతిలో ఉపయోగించేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు బీడ‌బ్ల్యూఎస్ఎస్‌బీ చెప్పుకొచ్చింది.


More Telugu News