ఎలక్టోరల్ బాండ్లు ప్రపంచంలోనే పెద్ద కుంభకోణం: పరకాల ప్రభాకర్

  • ఈ అంశం బీజేపీపై గణనీయమైన ప్రభావం చూపుతుందన్న ప్రభాకర్
  • రాబోయే రోజుల్లో ఇది పెద్ద సమస్యగా మారుతుందని వ్యాఖ్య
  • బీజేపీ ప్రభుత్వాన్ని ఓటర్లు కఠినంగా శిక్షిస్తారన్న ప్రభాకర్
ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం దేశ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద కుంభకోణమని చెప్పారు. ఇది లోక్ సభ ఎన్నికల్లో బీజేపీపై గణనీయమైన ప్రభావాలను చూపే అవకాశం ఉందని అన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ రోజురోజుకూ పెరుగుతోందని... అదొక కుంభకోణమనే సంగతి ఇప్పుడు అందరికీ అర్థమవుతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ఇష్యూ పెద్ద సమస్యగా మారుతుందని అన్నారు. ఈ అంశం కారణంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఓటర్లు కఠినంగా శిక్షిస్తారని చెప్పారు. 

సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్ల డేటాను అధికారిక వెబ్ సైట్లో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ బాండ్ల ద్వారా బీజేపీకి అత్యంత ఎక్కువగా రూ. 6,986.5 కోట్లు వచ్చాయి. టీఎంసీకి రూ. 1,397 కోట్లు, కాంగ్రెస్ కు రూ. 1,334 కోట్లు, బీఆర్ఎస్ కు రూ. 1,322 కోట్లు వచ్చాయి. ఎలక్టోరల్ బాండ్లను తక్షణమే ఆపేయాలని ఎస్బీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది.


More Telugu News