బీఎస్ఎన్ఎల్ యూజర్లకు సర్‌ప్రైజ్

  • 2 ప్లాన్ల వ్యాలిడిటీ పిరియడ్‌ను పొడగించిన ప్రభుత్వరంగ టెలికం సంస్థ
  • 120 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ గడువు 150 రోజులకు పెంపు
  • రూ.999 ప్లాన్ గడువు 200 రోజుల నుంచి 215 రోజులకు పొడగింపు
  • 4జీ సేవలు తీసుకురాబోతున్న నేపథ్యంలో సేవలను మెరుగుపరుస్తున్న ప్రభుత్వరంగ టెలికం సంస్థ
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన యూజర్లకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో ఉన్న 2 ప్లాన్ల వ్యాలిడిటీ గడువును పొడగించింది. 120 రోజుల వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్‌ను 150 రోజులకు పొడగించింది. ఈ మేరకు ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసినట్టు పేర్కొంది. యూజర్లు దేశవ్యాప్తంగా అన్ని టెలికాం సర్కిల్స్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చునని బీఎస్ఎన్ఎల్ వివరించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌పై రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, ప్రతి రోజు 0.5 జీబీ డేటాను పొందొచ్చని వివరించింది. 60 రోజుల పాటు రింగ్‌టోన్‌లను కూడా పొందొచ్చని, యూజర్ల అనుభూతిని ఈ ప్లాన్ మెరుగుపరుస్తుందని బీఎస్ఎన్ఎల్ ఆశాభావం వ్యక్తం చేసింది. 

ఇక రూ. 999 రీఛార్జ్ ప్లాన్‌పై ప్రస్తుతం 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుండగా దానిని 215 రోజులకు పొడగించింది. అయితే ఈ ప్లాన్‌లో యూజర్లు ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత డేటా వంటి అదనపు ప్రయోజనాలు పొందలేరు. అపరిమిత వాయిస్ కాలింగ్ సేవలను మాత్రమే పొందే వీలుంటుంది.

ఈ రెండు ప్లాన్ల వ్యాలిడిటీ పెంపుతో యూజర్లు తరచుగా రీఛార్జ్‌లు చేసుకోవాల్సిన అవసరం లేకుండా బీఎస్ఎన్ఎల్ గుడ్‌న్యూస్ చెప్పినట్టయ్యింది. వినియోగదారులకు మరిన్ని సేవలు అందించడమే లక్ష్యంగా అడుగులు ప్రభుత్వరంగ టెలికం కంపెనీ ఇటీవలే ఎంపిక చేసిన పలు ప్లాన్లలో డేటా పరిమితులను పెంచింది. అంతేకాకుండా ఇంటర్నెట్ స్పీడ్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసింది. దేశవ్యాప్తంగా త్వరలోనే 4జీ ప్లాన్లను ప్రారంభించబోతున్న నేపథ్యంలో కస్టమర్లకు ఆకర్షించేందుకు ఈ మేరకు సేవలను విస్తరిస్తోంది.


More Telugu News