కాశీ విశ్వనాథుడి ఆలయంలో పోలీసులకు ధోతీ-కుర్తా యూనిఫాం

  • ఆలయం ప్రాంగణంలో ఖాకీ యూనిఫాంకు స్వస్తి 
  • పురుషులకు ధోతీ-షాల్, మహిళా పోలీసులకు సల్వార్, కుర్తా యూనిఫాం 
  • భక్తులతో స్నేహపూర్వకంగా నడుచుకునేలా పోలీసులకు శిక్షణ
  • రద్దీ నియంత్రణకు నో టచ్ పాలసీ, క్యూలైన్లను తాళ్లతోనే నియంత్రించేందుకు ఏర్పాట్లు
  • పోలీసుల తీరుపై ఫిర్యాదులతో మార్పులకు ఆలయ అధికారుల నిర్ణయం
వారణాసిలోని విశ్వనాథుడి ఆలయంలో పోలీసులు ఇకపై ఖాకీ యూనిఫాంకు బదులు ధోతీల్లో కనిపించనున్నారు. భక్తులకు మరింత అనువైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా ఖాకీ దుస్తులకు పోలీసు ఉన్నతాధికారులు స్వస్తి పలికారు. ఖాకీ యూనిఫామ్‌తో కలిగే ప్రతికూల అభిప్రాయలను తొలగించేందుకు ఆలయ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పురుషులు ధోతీ, షాల్, మహిళా పోలీసుల సల్వార్ కుర్తాలను యూనిఫాంగా ధరించనున్నారు. అంతేకాకుండా, ఆలయంలో విధులు నిర్వర్తించే సమయంలో భక్తులతో స్నేహపూర్వకంగా ఎలా నడుచుకోవాలనే విషయంలో పోలీసులకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. 

భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు పలు ఇతర చర్యలు కూడా తీసుకున్నారు. ఇందులో భాగంగా పోలీసులు ఆలయంలో రద్దీ నియంత్రలో ‘నో టచ్’ విధానాన్ని అవలంబించనున్నారు. భక్తులను నేరుగా తాకకుండా తాళ్లతో క్యూలైన్లను నియంత్రిస్తారు. ‘‘దర్శనం కోసం భక్తులు పెద్ద పెద్ద క్యూలల్లో నిలబడాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు రద్దీ నియంత్రణలో స్నేహపూర్వక విధానాలను అవలంబించేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నాం’’ అని కమిషనర్ ఆఫ్ పోలీస్ మోహిత్ అగర్వాల్ తెలిపారు. 

వీఐపీ దర్శనాల సందర్భంగా భక్తుల క్యూలను తాళ్లతో నియంత్రిస్తూ వీఐపీలకు మార్గం సుగమం చేస్తారు. భక్తులను ఎట్టి పరిస్థితుల్లో చేతులతో తోస్తూ నియంత్రించేందుకు ప్రయత్నించరని అధికారులు పేర్కొన్నారు. కాశీ విశ్వనాథుడి ఆలయ రినోవేషన్ తరువాత గత రెండేళ్లల్లో భక్తుల రద్దీ పెరిగింది. దాంతో పాటూ పోలీసులపై ఫిర్యాదులూ పెరిగాయి. ఆలయ ప్రాంగణంలో భక్తులను బలవంతంగా పక్కకు నెడుతున్నారని అనేక మంది ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు మార్పులకు శ్రీకారం చుట్టారు.


More Telugu News