మరికాసేపట్లో అయోధ్య రాముడికి సూర్య తిలకం

  • రామ మందిరంలో అద్భుతం
  • మధ్యాహ్నం 12:15 నిమిషాలకు బాల రాముడి నుదుటిని ముద్దాడనున్న సూర్యుడు
  • నాలుగు నిమిషాల పాటు భక్తులకు కనువిందు చేయనున్న దృశ్యం
శ్రీరామ నవమి సందర్భంగా నేడు అయోధ్య రామ మందిరంలో అద్భుతం చోటుచేసుకోనుంది. మధ్యాహ్నం 12:15 నిమిషాలకు గర్భగుడిలో ఉన్న బాలక్ రామ్ విగ్రహం నుదుటిపై సూర్య తిలకం ఏర్పడనుంది. గుడి నిర్మాణంలో ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో ఏటా శ్రీరామ నవమి రోజు బాలక్ రామ్ నుదుటిని సూర్యుడు ముద్దాడనున్నాడు. సూర్యా అభిషేకంగా, సూర్య తిలకంగా వ్యవహరిస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా చూసేందుకు రామ భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు. కాగా, మందిర నిర్మాణం తర్వాత తొలి శ్రీరామ నవమి కావడంతో ఆలయ ట్రస్టు ఘనంగా ఏర్పాట్లు చేసింది. గుడిని, గుడి పరిసరాలను అందంగా అలంకరించడంతో పాటు భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. వేసవి ఎండల దృష్ట్యా ఆలయం ఆవరణలో కార్పెట్లను పరిచింది.

సూర్యతిలకం ఎలా ఏర్పడుతుందంటే..
మూడు అంతస్తులుగా నిర్మిస్తున్న రామ మందిరంలో ఇప్పటికే మొదటి అంతస్తు పూర్తయిన విషయం తెలిసిందే. మరో రెండు అంతస్తులు నిర్మాణం కొనసాగుతోంది. సూర్య తిలకం కోసం మూడో అంతస్తులో విదేశాల నుంచి తెప్పించిన అద్దాలను అమర్చారు. సూర్య కిరణాలు అందులో పడి రెండో అంతస్తులోకి, ఆపై గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గర్భగుడిలోని బాలక్ రామ్ విగ్రహం నుదుటిపై ప్రకాశిస్తాయి. సూర్యుడి గమనాన్ని, కిరణాలు ప్రసరించే కోణాన్ని లెక్కగట్టి ఈ అద్దాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రతీ సంవత్సరం శ్రీరామ నవమి రోజు మాత్రమే ఈ అద్భుతం చోటుచేసుకోనుంది.


More Telugu News