త్వరలో పరుగులు తీయనున్న వందే మెట్రో రైళ్లు!

  • నగరాల్లో ప్రజారవాణా సేవల కోసం ప్రారంభించేందుకు ఇండియన్ రైల్వేస్ ప్రణాళికలు
  • ఈ ఏడాది జులై నుంచి ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు సన్నాహాలు
  • తొలుత 12 కోచ్ లతో మెట్రో రైళ్ల పరుగులు.. డిమాండ్ పెరిగితే 16 కోచ్ లకు పెంచాలని యోచన

దేశంలో ఇటీవల ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో ఇండియన్ రైల్వేస్ మరో ముందడుగు వేయనుంది. నగరాల్లో ప్రజారవాణా అవసరాలు తీర్చేలా వందే మెట్రో రైళ్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ‘ఈ ఏడాది జులై నుంచి ప్రయోగాత్మకంగా వందే మెట్రో రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో ప్రజలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని ఆ అధికారి తెలిపారు.

వేగంగా వెళ్లగలగడంతోపాటు వెంటనే ఆగేందుకు నూతన టెక్నాలజీని ఇండియన్ రైల్వేస్ ఈ రైళ్లలో వినియోగించనుంది. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ స్టాప్ లలో ఆగేందుకు వీలవుతుంది. నగర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వందే మెట్రోలలో ఎన్నో కొత్త ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

‘ఈ ఏడాది ఈ రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే రెండు నెలల తర్వాత ఈ రైళ్ల పరీక్షలు మొదలవుతాయి. ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్లలో లేని సదుపాయాలు వందే మెట్రోలలో ఉంటాయి. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలను అతిత్వరలో ప్రజలతో పంచుకుంటాం’ అని ఆ ఉన్నతాధికారి వివరించారు. అలాగే ఏ నగరంలో ముందుగా వందే మెట్రోను అందుబాటులోకి తీసుకురావాలనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.

రైల్వే శాఖలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వందే మెట్రోలో బోగీల ఏర్పాటు ప్రత్యేకంగా ఉండనుంది. నాలుగేసి కోచ్ లను ఒక యూనిట్ గా పరిగణిస్తారు. కనీసం 12 కోచ్ లతో ఒక వందే మెట్రో ఉండనుంది. ఆయా రూట్లలో డిమాండ్ ను బట్టి కోచ్ ల సంఖ్యను 16కు పెంచుతారు.


More Telugu News