ఫేక్ వీడియోల వెనుక 'డబుల్ ఆర్'... వారిని వదిలిపెట్టేది లేదు: ప్రధాని మోదీ హెచ్చరిక

  • డబుల్ ఆర్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపు
  • అయోధ్య రామాలయాన్ని నిర్మించింది మోదీ కాదు... మీ ఓటు అంటూ ప్రధాని వ్యాఖ్య
  • ప్రధాని మాట్లాడుతుండగా 'మోదీ మోదీ' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు
ఫేక్ వీడియోలను విడుదల చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, ఈ వీడియోల విడుదల వెనుక డబుల్ ఆర్ పాత్ర ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రేవంత్ రెడ్డి ఈ వీడియోలను విడుదల చేస్తున్నారని ఆరోపించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... డబుల్ ఆర్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. ప్రతిపక్షాలు ఫేక్ వీడియోలతో ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.

'అయోధ్య రామాలయాన్ని నిర్మించింది మోదీ కాదు...'

'అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించింది నరేంద్ర మోదీ కాదు... మీరు మీ వేలితో వేసిన ఒక్కో ఓటు ద్వారా బాలరాముడి ఆలయం నిర్మించబడింద'ని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రభుత్వం పటిష్ఠంగా ఉంటే ఏం జరుగుతుందో ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూశారన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం రాకముందే రామమందిర నిర్మాణం జరగాల్సింది కానీ, ఢిల్లీలో నాటి నుంచి పటిష్ఠ ప్రభుత్వం లేకపోవడంతో నిర్మించలేకపోయారన్నారు.

ఇప్పుడు కూడా రామాలయాన్ని నిర్మించింది తాను కాదని, ప్రజలు వేసిన ఓటు ద్వారా ఈ ఆలయ నిర్మాణం సాధ్యమైందని పేర్కొన్నారు. మీరు వేసే ఓటు మీ కలను సాకారం చేసేందుకే ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. మా జీవితం అంతా దేశం కోసమేనని మోదీ అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం రాజకీయం చేస్తుందని విమర్శించారు. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో శ్రీరామనవమి శోభాయాత్రకు కూడా ఎన్నో ఆంక్షలు విధించారని ఆరోపించారు. మన పండుగలు చేసుకోవాలంటే ఇన్ని ఆంక్షలా? అని ప్రశ్నించారు. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయం కోసమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీ మోదీ అంటూ నినాదాలు

ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా పెద్ద ఎత్తున మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఈ మీ ప్రేమను చూస్తుంటే ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. పలుమార్లు మోదీ మోదీ అంటూ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలవకుంటే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తుందని ఆరోపించారు.


More Telugu News