రెండ్రోజుల్లోనే పచ్చి అరటి గెలంతా సహజంగా పండింది.. ఈ పెద్దావిడ చిట్కాకు నెటిజన్ల జేజేలు

  • ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ అవుతున్న అరటిపండ్లను సహజంగా మగ్గబెట్టే వీడియో
  • పచ్చి గెలను గొయ్యి తీసి మట్టి కప్పిన పెద్దావిడ
  • రెండు రోజులు అయ్యాక తిరిగి గొయ్యి తవ్వి చూస్తే గెల మొత్తం మగ్గిన వైనం
అరటిపండ్లు.. సామాన్యుడి యాపిల్ గా దీనికి పేరు. అయితే మార్కెట్ లో మాత్రం సరైన అరటిపండ్లను కొనడం సవాలే. ఎందుకంటే సాధారణంగా పైకి నిగనిగలాడుతూ పసుపుపచ్చ రంగులో కనిపించినా తీరా తొక్క తీసి చూస్తే మాత్రం లోపల పచ్చిగా ఉంటాయి. చాలా మంది వ్యాపారులు రసాయనాలతో అరటి గెలలను మగ్గబెట్టడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది.

అయితే దీనికి ఓ పెద్దావిడ చూపిన చిట్కా నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. కేవలం రెండు రోజుల్లోనే పచ్చి అరటి గెల కాస్తా సహజ పద్ధతిలో పసుపు రంగులోకి మారేలా ఆమె మార్చడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియోలో దక్షిణ భారతదేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన పెద్దావిడ అరటి తోటలోంచి ఓ పెద్ద పచ్చి అరటి గెలను తెంపుతుంది. ఆ తర్వాత దాన్ని ఓ గొయ్యి తీసి అందులో పెడుతుంది. ఓ చిన్న గిన్నెలో పిడకలకు నిప్పు అంటించి గెల పక్కనే ఉంచింది. ఆ తర్వాత ఆ గెలను అరటి ఆకులతో కప్పేసింది. అలాగే గోతిపై అరటి, కొబ్బరి ఆకులు కప్పి దాన్ని తిరిగి మట్టి కప్పేసి పూడ్చేసింది. రెండు రోజుల తర్వాత తిరిగి గోతిని తవ్వి చూడగా ఆశ్చర్యకరంగా పచ్చి అరటిగెల కాస్తా పసుపుపచ్చ రంగులోకి మారిపోయింది. దీంతో ఆ గెలను పైకి తీసి శుభ్రపరిచిన ఆ పెద్దావిడ ఓ పండును రుచి తీసింది. తియ్యగా ఉందని తెలిశాక దాన్ని విక్రయించేందుకు మార్కెట్ కు తరలించింది.


More Telugu News