గన్నవరం విమానాశ్రయంలో ఎన్నారై వైద్యుడు లోకేశ్ అడ్డగింత.. శాటిలైట్ ఫోన్ స్వాధీనం

  • ఇటీవల స్వగ్రామం వచ్చిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్
  • తిరిగి అమెరికా వెళ్తుండగా గన్నవరం విమానాశ్రయంలో అడ్డగింత
  • ఆయన నుంచి శాటిలైట్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్నందుకు గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకే‌శ్‌ను గన్నవరం విమానాశ్రయ సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. అమెరికా పౌరసత్వం కలిగిన ఆయన ఇటీవల స్వగ్రామానికి వచ్చారు. అనంతరం నిన్న అమెరికాకు వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ చెక్‌ఇన్‌లో ఆయన వద్ద శాటిలైట్ ఫోన్ ఉన్నట్టు ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి శాటిలైట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. 

దానిని తాను వర్జీనియాలో కొనుగోలు చేశానని, వస్తూ వెంట తీసుకొచ్చానని అధికారులకు లోకేశ్ వివరణ ఇచ్చారు. దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పడంతో మధ్యాహ్నం తర్వాత ఆయనను విడిచిపెట్టారు. కాగా, డాక్టర్ లోకేశ్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఉన్న శాటిలైట్ ఫోన్‌ను గుర్తించామని, ఆ ఫోన్‌తో ఆయన దేశీయ విమానాశ్రయాల మీదుగా రాకపోకలు సాగించినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు.  కాగా, శుక్రవారం రాత్రి విమానాశ్రయంలో తనపై అమానుషంగా ప్రవర్తించారంటూ డాక్టర్ లోకేశ్ చేసిన ఫిర్యాదుపై అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది. గన్నవరం పోలీసుల నుంచి వివరాలు సేకరించింది.


More Telugu News