ఏపీలో కూటమి ఏర్పడ్డాక ఈసీ వైఖరి మారింది: సజ్జల ఫైర్

  • ఈసీకి చంద్రబాబు వైరస్ సోకినట్టుందన్న సజ్జల
  • చంద్రబాబు, అతడి మనుషులు చెప్పినట్టుగానే నడుచుకుంటోందని విమర్శలు
  • అంపైర్ లా వ్యవహరించాల్సిన ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళుతోందని వ్యాఖ్యలు
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏపీలో కూటమి ఏర్పడ్డాక ఈసీ వైఖరి మారిందని ఆరోపించారు. ఈసీకి కూడా చంద్రబాబు వైరస్ సోకినట్టుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, అతడి మనుషులు చెప్పినట్టుగానే ఈసీ నడుచుకుంటోందని అన్నారు. 

అంపైర్ లా వ్యవహరించాల్సిన ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళుతోందని విమర్శించారు. పోలింగ్ కేంద్రం నుంచి పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చిందని సజ్జల ప్రశ్నించారు. మరి అదే సమయంలో టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటికి రాలేదని నిలదీశారు. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించేట్టయితే, రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజి ఘటనలు ఎక్కడెక్కడ  జరిగాయో అవన్నీ బయటపెట్టాలని అన్నారు. ఆయా ఘటనలకు ముందు, వెనుక, పోలింగ్ బూత్ పరిసరాల్లో కూడా ఏం జరిగిందో బయటికి రావాల్సిన అవసరం ఉందని సజ్జల స్పష్టం చేశారు.

బాధితులమని చెప్పుకుంటున్న టీడీపీ ఎందుకు రీపోలింగ్ అడగడంలేదని ప్రశ్నించారు. అడ్డంగా రిగ్గింగ్ చేసుకున్నారు కాబట్టే టీడీపీ వాళ్లు రీపోలింగ్ అడగడంలేదని, దానివల్ల దెబ్బతిన్నారు కాబట్టి మా వాళ్లు అడుగుతున్నారు అని సజ్జల పేర్కొన్నారు. ఇప్పుడు సీఎస్ ను తొలగించాలంటూ టీడీపీ కుట్రలు చేస్తోందని సజ్జల మండిపడ్డారు.


More Telugu News