సమాజ నిర్మాణంలో తుమ్మబాల సేవలు ఎనలేనివి: సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

  • అనారోగ్యంతో మాజీ ఆర్చ్‌ బిషప్‌ తుమ్మబాల కన్నుమూత‌  
  • తుమ్మబాల పార్థివ దేహానికి రేవంత్‌ నివాళులు
  • ప్రజలకు శాంతి, మతసామరస్యం, విద్యను అందించారని వ్యాఖ్య‌
  • వ్యక్తిగతంగా ఆయనతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న సీఎం
హైదరాబాద్‌ మాజీ ఆర్చ్‌ బిషప్‌ తుమ్మబాల(80) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. వరంగల్‌ బిషప్‌గా పాతికేళ్ల‌ పాటు పని చేసిన తుమ్మబాల అంత్యక్రియలు ఇవాళ‌ జరగనున్నాయి. సికింద్రాబాద్‌ సెయింట్‌ మేరీ బసిలికీలో తుమ్మబాల పార్థివ దేహాన్ని ఖ‌న‌నం చేయనున్నారు.

కాగా, సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్‌లో విశ్రాంత ఆర్చ్ బిషప్ తుమ్మబాల పార్థివ దేహానికి ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి శుక్ర‌వారం నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. సమాజ నిర్మాణంలో తుమ్మబాల ఎనలేని సేవలు అందించారని చెప్పారు. ప్రజలకు శాంతి, మతసామరస్యం, విద్యను అందించారని తెలిపారు. వ్యక్తిగతంగా ఆయనతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.

2019 ఎంపీ ఎన్నికల్లో, 2023 శాసనసభ ఎన్నికల్లో తమను మంచి మనసుతో ఆశీర్వదించారని చెప్పారు. వారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఆయన మరణం వారి అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. వారి సేవలను కొనియాడుతూ.. వారి సందేశ స్ఫూర్తితో ముందుకుసాగాలని తెలిపారు.


More Telugu News