టెస్లా కాకుండా మస్క్ కొన్న కార్లు ఇవే..!

  • మస్క్ వాడిన కార్లు అన్నీ అత్యంత ఖరీదైనవే
  • ఒక కారు ఏకంగా అంతరిక్ష యాత్ర చేసి వచ్చింది
  • చిన్ననాటి డ్రీమ్ కారును సొంతం చేసుకున్న మస్క్
ఎలక్ట్రిక్ కార్ విభాగంలో టెస్లా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి కంపెనీకి ఓనర్ అయిన ఎలాన్ మస్క్ వేరే కంపెనీల కార్లను ముచ్చటపడి కొనుక్కున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను సొంతం చేసుకుని, కొన్నాళ్లు వాడి వదిలేసిన మస్క్.. వాటిలో కొన్ని కార్లను మాత్రం తన దగ్గరే అట్టిపెట్టుకున్నారు. చిన్ననాటి డ్రీమ్ కారును కొనుగోలు చేసి సరదాగా షికార్లు చేశారు. ఓ కారును ఏకంగా అంతరిక్షానికి పంపించి తిరిగి తెప్పించుకున్నారు. ఎలాన్ మస్క్ వాడిన కార్ల విశేషాలు.. 

మస్క్ మొదటి కారు బీఎండబ్ల్యూ..
1994లో మస్క్ కొనుగోలు చేసిన ఫస్ట్ కార్ బీఎండబ్ల్యూ 3 సిరీస్ కు చెందిన ఈ21 320ఐ.. ఈ సిరీస్ లో వచ్చిన ఫస్ట్ కారును మస్క్ సొంతం చేసుకున్నారు. 2.0 లీటర్ ఇన్ లైన్ ఫోర్ ఇంజన్, 110 హెచ్ పీ సామర్థ్యంతో ప్రత్యేకంగా తయారు చేసిన కారు ఇది. ఆయన కంపెనీ సిబ్బంది ఒకరు నడుపుతుండగా బ్రేక్ డౌన్ కావడంతో మరమ్మతు చేయించి మస్క్ దీనిని అమ్మేశారు.

2012 లో పోర్షె కంపెనీకి చెందిన 911 టర్బో కారును మస్క్ కొనుగోలు చేశారు. ఈ కారు మీదున్న అభిమానమే టెస్లా కంపెనీ ఆవిష్కరణకు పరోక్ష కారణమని మస్క్ ఓ సందర్భంలో వెల్లడించారు. ఈ కారులో లిథియం అయాన్ బ్యాటరీ అమర్చాలంటూ అలాన్ కొకొని అనే ఇంజనీర్ ను మస్క్ సంప్రదించగా.. కొకొని నిరాకరించాడు. ఆయన ఇచ్చిన ఐడియాతోనే మస్క్ టెస్లా కంపెనీ స్థాపించారు. కాగా, పోర్షె 911 టర్బో కారు ప్రస్తుతం ఆయన వద్దే ఉందా లేక అమ్మేశారా అనే విషయంపై స్పష్టత లేదు.

1967 జాగ్వార్ ఈ టైప్ రోడ్ స్టర్..
జాగ్వార్ కారు మస్క్ చిన్నప్పటి డ్రీమ్ కారు.. ప్రపంచంలోనే అత్యంత అందమైన కారు ఏదంటే కార్ లవర్స్ చెప్పే పేరు జాగ్వార్ ఈ టైప్. దీనికోసం మస్క్ 265 హార్స్ పవర్, 4.2 లీటర్ల సిక్స్ ఇంజిన్ కారును కొనుగోలు చేశారు.

1997 మెక్ లారెన్ ఎఫ్ 1
టర్బోల వంటి అదనపు సదుపాయాలు లేని కార్లలో అత్యంత వేగంగా దూసుకెళ్లే కారు ఇదే.. ప్రపంచంలో ఈ రోజు వరకూ ఈ రికార్డు మెక్ లారెన్ ఎఫ్ 1 పేరిటే ఉంది. ముగ్గురు ప్రయాణించేలా డిజైన్ చేసిన ఈ కారులో ప్రయాణిస్తూ మస్క్ యాక్సిడెంట్ చేశారు. దీంతో రిపేర్లు చేయించి కారును అమ్మేశారు.

1946 లోటస్ ఎస్పిరిట్..
జేమ్స్ బాండ్ సినిమాలో ఉపయోగించిన కారు ఇది. 2013లో వేలానికి వచ్చిన ఈ కారును మస్క్ సొంతం చేసుకున్నారు. నేల మీద వేగంగా దూసుకెళ్లే ఈ కారు.. నీళ్లల్లో సబ్ మెరైన్ లా మారిపోతుంది.

1920 ఫోర్డ్ మోడల్ టీ..
టిన్ లిజ్జీ అని ముద్దుగా పిలుచుకునే ఫోర్డ్ మోడల్ టీ కారు హెన్రీ ఫోర్డ్ తయారు చేశారు. అప్పట్లో కార్లకు విపరీతంగా డిమాండ్ ఉండడంతో స్పెషల్ గా డిజైన్ చేసి తయారుచేసిన మోడల్ ఇది. వాణిజ్యపరమైన అవసరాల కోసం తయారైన తొలి కారుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుత కమర్షియల్ ట్రాన్స్ పోర్ట్ కార్లకు ఈ కారే స్ఫూర్తి అని ఆటోమొబైల్ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఈ కారుకు మస్క్ తన కార్ల కలెక్షన్ లో చోటిచ్చారు. అయితే, దీనిని ఆయనే కొనుగోలు చేశారా లేక బహుమతిగా అందుకున్నారా అనే విషయంలో స్పష్టత లేదు.

2010 ఔడీ క్యూ7..
ముచ్చటపడి సొంతం చేసుకున్నప్పటికీ మస్క్ కు ఈ కారు విషయంలో కొంత అసంతృప్తి ఉందని తెలుస్తోంది. ఈ కారు బ్యాక్ సీటు విషయంలో మస్క్ ఓ ట్వీట్ లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారు విషయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందిని టెస్లా కారు వినియోగదారులు ఎదుర్కోకుండా జాగ్రత్తపడ్డట్లు చెప్పారు. కాగా, ఈ కారును మస్క్ అమ్మేసినట్లు తెలుస్తోంది.

బీఎండబ్ల్యూ ఎం5 హమన్ మోటార్ స్పోర్ట్..
ఏకంగా 600 హార్స్ పవర్ తో గంటకు 200 మైళ్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ కారును మస్క్ కొంతకాలం పాటు ఉపయోగించారు. బీఎండబ్ల్యూ ఎం5 మోడల్ లో 5.0 లీటర్ వి10 ఇంజన్ ఉండగా.. హమన్ కంపెనీతో జతకట్టడం ద్వారా ఈ మోడల్ కు అదనపు హంగులద్దారు. అయితే, ఈ కారు ప్రస్తుతం మస్క్ వద్ద లేదు. దీనిని అమ్మేసినట్లు మస్క్ తెలిపారు.

ఈ ఎనిమిది కార్లతో పాటు తన సొంత కంపెనీకి చెందిన సైబర్ ట్రక్, మోడల్ వై, మోడల్ ఎస్ లతో పాటు అంతరిక్షంలోకి పంపిన టెస్లా రోడ్ స్టర్ కారు కూడా మస్క్ గ్యారేజీలో ఉంది. 2018లో ఈ కారును అంతరిక్షంలోకి పంపడం ద్వారా మస్క్ ఈ కారు ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా చేశారు.



More Telugu News