ఆగస్టు 15 లోగా రుణమాఫీ పూర్తిచేస్తామన్నారు.. ఎక్కడ చేశారు?: హరీశ్ రావు

  • సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత
  • ఎన్నికల మేనిఫెస్టోలో 40 వేల కోట్లు మాఫీ చేస్తామన్నారు
  • కేబినెట్ భేటీలో 31 వేల కోట్లకు తగ్గించారు
  • బడ్జెట్ లోనేమో 26 వేల కోట్లు కేటాయించారని హరీశ్ రావు విమర్శ
  • తీరా చేసిందేమో 17 వేల కోట్ల రూపాయలు మాత్రమేనని ఆరోపణ
  • రైతు రుణమాఫీపై హరీశ్ రావు కీలక ప్రెస్ మీట్
తెలంగాణలో ఆగస్టు 15 తర్వాత రైతులంతా రుణవిముక్తులు అవుతారని సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ప్రకటనలు చేశారు.. ఇప్పుడు లెక్కలు చూస్తే కేవలం 22 లక్షల మంది రైతులకు, రూ.17 వేల కోట్ల రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి గతంలో హరీశ్ రావుకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య ఛాలెంజ్ ల పర్వం కొనసాగిన విషయం తెలిసిందే. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీది బోగస్ హామీ అని, ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఈ క్రమంలోనే ఆగస్టు 15న రూ.2 లక్షల వరకున్న రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్లు వైరా సభావేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికలో హరీశ్ రావును కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. దీనిపై శనివారం హరీశ్ రావు స్పందించారు. రైతు రుణమాఫీకి సంబంధించి తన సవాలు గురించి మాట్లాడేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

రుణమాఫీ పాక్షికమే..
రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి బూటకపు మాటలు చెబుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఓ మాట, ఇప్పుడొక మాట అన్నట్లుగా మాటలతో పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ఆగస్టు 15 లోపు రాష్ట్రంలో సంపూర్ణ రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానన్నారు. అయితే, ప్రభుత్వం రుణమాఫీ పూర్తిగా చేయలేదని, పాక్షికంగా మాత్రమే చేసిందని తెలిపారు. రుణమాఫీ లెక్కల విషయానికి వస్తే కాంగ్రెస్ నేతలు, రేవంత్ రెడ్డి చెప్పిన మాటల ఆధారంగానే మాఫీ లెక్కలు పరిశీలించవచ్చని చెప్పారు. రేవంత్ రెడ్డి వివిధ సందర్భాలలో మాట్లాడిన మాటలను వినిపిస్తూ రుణమాఫీ ఎక్కడ పూర్తయిందో చెప్పాలని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోలో రూ.40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. దీనికి సంబంధించిన పేపర్లను హరీశ్ రావు మీడియాకు చూపించారు. ప్రభుత్వంలోకి వచ్చాక రైతు రుణమాఫీపై కేబినెట్ మీటింగ్ తర్వాత ఈ మొత్తం నిధులు రూ.31 వేల కోట్లకు తగ్గించారని గుర్తుచేశారు. రుణమాఫీ అమలుకు రాష్ట్ర బడ్జెట్ లో రూ.26 వేల కోట్లు మాత్రమే కేటాయించారని హరీశ్ రావు చెప్పారు. దీనిపై తాను అసెంబ్లీలోనే ప్రభుత్వాన్ని నిలదీశానని గుర్తుచేశారు.

‘‘ఎన్నికల మేనిఫెస్టోలో 40 వేల కోట్లని అన్నారు.. కేబినెట్ సమావేశంలో 31 వేల కోట్లు చెప్పారు, బడ్జెట్ లో 26 వేల కోట్లు కేటాయించారు. ఈ నిధులు ఎక్కడ సరిపోతాయి? ఎవరికి ఎగవెడతరు?’’ అని ప్రశ్నించినట్లు చెప్పారు. వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత నిజంగానే రుణమాఫీ పూర్తిచేశారేమోననే ఆశతో లెక్కలు చూశామని హరీశ్ రావు చెప్పారు. అయితే, రాష్ట్రంలో ఇప్పటి వరకు 22 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్ల రుణాలు మాత్రమే మాఫీ అయినట్లు గుర్తించామని హరీశ్ రావు చెప్పారు. రుణమాఫీ పూర్తిచేయకుండా తనను రాజీనామా చేయమనడం కాదు.. రైతు రుణమాఫీ పాక్షికంగానే చేసినందుకు ప్రజలను క్షమాపణ కోరాలని, నిజాయితీ ఉంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.




More Telugu News