281 మంది భ‌ద్ర‌తా సిబ్బందిని తొల‌గించిన తాలిబ‌న్ స‌ర్కార్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • ఉద్యోగులు గ‌డ్డం పెంచ‌డంలో విఫ‌లం కావ‌డ‌మే కార‌ణం
  • ఇస్లామిక్ చ‌ట్టాల ప్ర‌కారం త‌మ ప్ర‌భుత్వంలో ప‌నిచేసే ప్ర‌తి ఒక్క‌రు గ‌డ్డం పెంచాల్సిందేనని హుకుం
  • లేని ప‌క్షంలో ఉద్యోగాల నుంచి తొల‌గిస్తామ‌ని తాలిబ‌న్ స‌ర్కార్ హెచ్చ‌రిక‌
మ‌న‌కు తెలిసి విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హించినందుకుగానో, లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డితేనో లేక ఇత‌ర కార‌ణాల‌తోనో ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వాధికారులు తొల‌గించ‌డం చూశాం. కానీ, ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని తాలిబ‌న్ ప్ర‌భుత్వం సరికొత్త కార‌ణంతో 281 మంది భ‌ద్ర‌తా సిబ్బందిని విధుల నుంచి తొల‌గించింది. అదేంటంటే.. స‌ద‌రు ఉద్యోగులు గ‌డ్డం పెంచ‌డంలో విఫ‌లం కావ‌డ‌మే. ఇలా వారికి గ‌డ్డంలేని కార‌ణంగా విధుల నుంచి తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. 

ఇస్లామిక్ చ‌ట్టాల ప్ర‌కారం త‌మ ప్ర‌భుత్వంలో ప‌నిచేసే ప్ర‌తి ఒక్క‌రు గ‌డ్డం పెంచాల్సిందేనని ఈ సంద‌ర్భంగా తాలిబ‌న్లు పేర్కొన్నారు. లేని ప‌క్షంలో ఉద్యోగాల నుంచి తొల‌గిస్తామ‌ని తాలిబ‌న్ స‌ర్కార్ హెచ్చ‌రించింది. ఇక‌ గ‌తేడాది కాలంగా దేశంలో అనైతిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డిన 13వేల మందిని అదుపులోకి తీసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. 

ఇక‌ 2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత మ‌హిళా మంత్రిత్వ శాఖను ర‌ద్దు చేసి నైతిక మంత్రిత్వ శాఖ‌ను ఏర్పాటు చేసింది. కాగా, ఈ మంత్రిత్వ‌ శాఖ ఏర్ప‌డిన త‌ర్వాత నుంచి అక్క‌డి ప్ర‌జ‌ల‌కు భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ లేకుండాపోయింది. ముఖ్యంగా మ‌హిళ‌ల ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. 

మ‌హిళ‌లు హిజాబ్ ధ‌రించ‌నందుకు ప‌లుమార్లు నైతిక మంత్రిత్వ‌శాఖ అధికారులు వారిపై కేసులు బ‌నాయించి జైలులో సైతం పెట్టారు. దీంతో ఈ శాఖ తీరుపై మాన‌వ హ‌క్కుల సంస్థ‌లు, యూఎన్ఓ బ‌హిరంగంగానే విమ‌ర్శించాయి.


More Telugu News