దుర్గం చెరువులోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా గురి.. ముఖ్యమంత్రి సోదరుడితో పాటు పలువురికి నోటీసులు

  • 204 భవనాలకు నోటీసులు జారీ చేసిన అధికారులు
  • రాజకీయ, సినీ రంగాలతో పాటు పలువురు అధికారుల ఇళ్లకు నోటీసులు అందినట్టు సమాచారం
  • యజమానుల్లో మొదలైన గుబులు
  • దుర్గం చెరువు చుట్టూ వెలసిన విలాసవంత భవనాలు
హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న ‘హైడ్రా’ అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతో చెరువులు, నాలాల ఆక్రమణలకు పాల్పడి, అనుమతులు లేకుండా భవనాలు నిర్మించినవారు వణికిపోతున్నారు. ముఖ్యంగా హైటెక్‌సిటీలోని రాయదుర్గం, మాదాపూర్‌ పరిధిలో ఉండే దుర్గం చెరువు చుట్టూ విలాసవంతమైన భవనాలు నిర్మించినవారు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో మొత్తం 204 ఇళ్లకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వడం ఇందుకు కారణంగా ఉంది. నోటీసులు అందుకున్నవారు వణికిపోతున్నారు. కాగా మాదాపూర్, అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఉంటున్న ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి కూడా నోటీసులు ఇవ్వడం గమనార్హం. అలాగే, సినీ, రాజకీయ రంగాలకు చెందినవారితో పాటు కొంతమంది ఐఏఎస్‌లు, ఐఆర్‌ఎస్‌ అధికారులకు చెందిన ఇళ్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.     

రాంనగర్‌లో ఆక్రమణలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ పూర్తి స్థాయిలో దృష్టిసారించారు. అధికారులతో రిపోర్టులు తెప్పించుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలనలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌లో ఆక్రమణలను ఆయన పరిశీలించారు. బుధవారం సాయంత్రం రంగనాథ్‌ పర్యటించారు. స్థానికుల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించారు. రాంనగర్‌ చౌరస్తాలోని మణెమ్మ గల్లీలో నాలాపై అక్రమంగా భవనాలు నిర్మించారని, మణెమ్మ వీధిలో రోడ్డు ఇరుకుగా మారిపోయిందంటూ అందిన ఫిర్యాదుల పరిశీలన కోసం ఆయన వెళ్లారు. సంబంధిత స్థలాల పత్రాలను పరిశీలించాలని అధికారులకు రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు.


More Telugu News