సక్సెస్‌ బాటలో 'లవ్ రెడ్డి' ఫెయిల్యూర్‌ మీట్‌...? 'లవ్‌ రెడ్డి' టీమ్‌కు ప్రభాస్‌ సపోర్ట్‌!

  • సినీ హీరోల సపోర్ట్‌ కోరిన లవ్‌ రెడ్డి మూవీ టీమ్‌ 
  • లవ్‌ రెడ్డి టీమ్‌ను సపోర్ట్‌ చేస్తున్న హీరో ప్రభాస్‌ 
  • ప్రభాస్‌పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
అంజన్‌ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా నటించిన చిత్రం లవ్‌ రెడ్డి. స్మరణ్ రెడ్డి దర్శకత్వంలో సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఓ డిఫరెంట్‌ లవ్‌స్టోరీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే తమ చిత్రాన్ని ప్రేక్షకులకు చేర్చడంలో తాము ఫెయిల్‌ అయ్యామని పేర్కొంటూ, చిత్ర యూనిట్‌ డిఫరెంట్‌గా ఫెయిల్యూర్‌ మీట్‌ను నిర్వహించింది. 

తాము సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయడంలో సక్సెస్ కాలేదని అందుకే ఈ ఫెయిల్యూర్‌ మీట్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. తమకు సినీ పరిశ్రమలోని హీరోలు, ప్రముఖుల సపోర్ట్‌ ఉంటే ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని, ఇందుకు తమకు సినీ ప్రముఖుల సపోర్ట్‌ కావాలని చిత్ర యూనిట్‌ ఈ ఫెయిల్యూర్‌ మీట్‌లో అభ్యర్థించింది. 

కాగా, ఈ ప్రెస్‌మీట్‌ పట్ల ప్రముఖ కథానాయకుడు ప్రభాస్‌ స్పందించారు. . ఈ క్రమంలోనే ప్రభాస్.. లవ్ రెడ్డి చిత్రాన్ని ప్రొత్సహిస్తూ ఇన్ స్టా వేదికగా తన సపోర్ట్‌  ప్రకటించారు. 

లవ్ రెడ్డి చిత్రానికి సంబంధించి ఎన్నో మంచి విషయాలు వింటున్నానని, ఇటీవల కాలంలో విడుదలైన ప్రేమ కథల్లో లవ్ రెడ్డి మంచి చిత్రంగా నిలవడం ఆనందంగా ఉందని ప్రభాస్ ఈ పోస్ట్‌లో తెలిపారు. ఈ మేరకు ఇన్ స్టాలో తన అభిమానుల కోసం లవ్ రెడ్డి ట్రైలర్ ను షేర్ చేస్తూ ఆ చిత్రానికి సపోర్ట్‌గా ఉండాలని ప్రభాస్ కోరారు. ఇప్పటికే ఈ చిత్రానికి హీరో కిరణ్ అబ్బవరం ముందుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో 4 స్పాన్సర్ షోలు వేసి మద్దతు తెలిపాడు. ప్రభాస్ లాంటి పాన్‌ ఇండియా కథానాయకుడు లవ్ రెడ్డి చిత్రానికి అండగా నిలవడం పట్ల చిత్ర బృందం సంతోషంలో ఉంది. 

మరోపక్క, ప్రభాస్ లవ్ రెడ్డి చిత్రానికి మద్దతుగా నిలవడం పట్ల సోషల్‌ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సో.. లవ్‌ రెడ్డి టీమ్‌ వినూత్నంగా నిర్వహించిన ఫెయిల్యూర్‌ మీట్‌కు జెన్యూన్ రెస్పాన్స్‌ వస్తోంది. రానున్న రోజుల్లో ఈ చిత్రానికి మరి కొంత మంది సినీ ప్రముఖులు సపోర్ట్‌ గా నిలిచే అవకాశం ఉంది. 


More Telugu News