చర్లపల్లి రైల్వే టెర్మినల్ మరో నెల రోజుల్లో అందుబాటులోకి వస్తుంది: కిషన్ రెడ్డి

  • రూ.430 కోట్లతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణం
  • 20 రైళ్లు ఆగే సదుపాయం
  • నేడు చర్లపల్లి టెర్మినల్ ను పరిశీలించిన కిషన్ రెడ్డి
  • త్వరలోనే ప్రధాని మోదీ టెర్మినల్ ను ప్రారంభిస్తారని వెల్లడి 
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు హైదరాబాదులోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను పరిశీలించారు. టెర్మినల్ పనులు ఇప్పటివరకు దాదాపు 98 శాతం పూర్తయ్యాయి. తన పర్యటన సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మరో నెల రోజుల్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. త్వరలోనే ఈ భారీ టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. 

అత్యాధునిక సదుపాయాలతో కూడిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను రూ.430 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. కాగా, తెలంగాణకు మూడు మేజర్ రైల్వే టెర్మినల్స్ ఉన్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లిలో రూ.430 కోట్లు, సికింద్రాబాద్ లో రూ.715 కోట్లు, నాంపల్లిలో రూ.429 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు. 

చర్లపల్లి రైల్వే టెర్మినల్ లో 20 రైళ్లు ఆగే సదుపాయం ఉందని అన్నారు. గూడ్స్ రైళ్లు కూడా ఇక్కడే అన్ లోడ్ చేసుకునే సౌకర్యం ఉందని చెప్పారు. చర్లపల్లి టెర్మినల్ పూర్తయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రద్దీ తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. 

అయితే, చర్లపల్లి నుంచి నగరంలోకి కనెక్టివిటీ పెంచాల్సి ఉందని పేర్కొన్నారు. అందుకోసం, రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.


More Telugu News