మూసీ వద్ద ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తున్నాం: బండి సంజయ్

  • మూసీ నదిని ఏటీఎంలా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం
  • నిరుపేదల ఇళ్లను కూల్చివేస్తే ఊరుకునేది లేదన్న బండి సంజయ్
  • పాలకులు చేస్తున్న అప్పు ప్రజలకు భారంగా మారుతోందని ఆవేదన
మూసీ నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతను తాము వ్యతిరేకిస్తున్నామని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టును నిన్నటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని ఏటీఎంలా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పరీవాహక ప్రాంతంలోని నిరుపేదల ఇళ్లను కూల్చివేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

మూసీ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయల అప్పు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వడ్డీల రూపంలో పది నెలల్లోనే రూ.60 వేల కోట్లు చెల్లించారన్నారు. పాలకులు చేస్తున్న అప్పుల కారణంగా రాష్ట్రంపై, ప్రజలపై భారం పడుతోందని మండిపడ్డారు.

ఆరు గ్యారెంటీలు సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రభుత్వ దోపిడీ, హైడ్రా పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతకు మాత్రం తాము వ్యతిరేకమన్నారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ రేపు ఇందిరా పార్క్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపడుతున్నట్లు తెలిపారు.


More Telugu News