నా గురించి నాకు తెలుసు.. ఎదుటివారి మాటలకు ఎందుకు బాధపడాలి?: జయం రవి

  • ఆర్తి వ్యాఖ్యల్లో నిజం లేదన్న జయం రవి
  • వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా కొందరు ప్రవర్తిస్తారని వ్యాఖ్య 
  • వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న రవి  
లైమ్‌లైట్‌లో ఉండటంతో తాము ఏమి చేసినా ప్రజలు గమనిస్తూ ఉంటారని నటుడు జయం రవి అన్నారు. ఆర్తి నుంచి తాను విడాకులు తీసుకుంటున్నానని గత నెలలో జయం రవి ప్రకటించారు. అయితే, తన అనుమతి తీసుకోకుండానే, తనకు తెలియకుండానే విడాకుల గురించి రవి బహిరంగ ప్రకటన చేశారంటూ ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో రవిపై సోషల్ మీడియాలో పలు వదంతులు వచ్చాయి. రవి తీరును కొందరు తప్పుబట్టారు.

వీటిపై ఓ ఇంటర్వ్యూలో రవి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్తి వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. ఇరు కుటుంబాల పెద్దలతో చర్చించామన్నారు. గాయనితో తాను రిలేషన్‌లో ఉన్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు మంచి లేదా చెడు ఏమి జరిగినా ప్రజలు గమనిస్తూ ఉండటంతో పాటు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారన్నారు. దానిని నివారించలేమన్నారు. కొందరు సినిమాలు, నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి ఇష్టపడుతుంటారని, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని రవి అభిప్రాయపడ్డారు. 

ఎలాంటి సందేహాలు, ఒత్తిళ్లు లేకుండా ఉన్నప్పుడే వృత్తికి తాను న్యాయం చేయగలనని అన్నారు. తన వ్యక్తిగత బాధ్యత గురించి ప్రతి ఒక్కరికి చెప్పలేనన్నారు. పరిణతి చెందిన కొంత మంది వదంతులు వ్యాప్తి చేయరని, మరి కొందరు ఆ విషయంలో ఉన్న తీవ్రత అర్ధం చేసుకోకుండా వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తారని అన్నారు. నా  గురించి నాకు తెలిసినప్పుడు ఎదుటి వారి మాటలకు ఎందుకు బాధపడాలని ప్రశ్నించారు. 


More Telugu News