బైక్ రైడ్ క్యాన్సిల్ చేసినందుకు అసభ్య వీడియోలు పంపి మహిళా డాక్టర్‌కు వేధింపులు

  • పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఘటన
  • బైక్ రావడం ఆలస్యం అవుతుండటంతో రైడ్ రద్దు చేసిన వైద్యురాలు
  • రైడ్ రద్దు కావడంతో 17 సార్లు ఫోన్.. ఆపై అసభ్య వీడియోలతో రైడర్ వేధింపులు
బైక్ రైడ్ క్యాన్సిల్ చేసిన ఓ మహిళా వైద్యురాలికి వేధింపులు ఎదురయ్యాయి. రైడర్ ఆమెకు అస్తమానం ఫోన్ చేయడంతో పాటు అసభ్య వీడియోలు పంపి వేధించాడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలు శనివారం రాత్రి ఓ యాప్‌లో బైక్ రైడింగ్ బుక్ చేశారు. అయితే, బైక్ రావడం ఆలస్యం అవుతుండటంతో రైడ్‌ను రద్దు చేశారు.

రైడ్ రద్దు చేసిందన్న ఆగ్రహంతో ఆ రైడర్ ఆమెను వేధింపులకు గురిచేశాడు. వైద్యురాలికి 17సార్లు ఫోన్ చేయడంతోపాటు ఆమె వాట్సాప్‌కు అశ్లీల వీడియోలు పంపాడు. అక్కడితో ఆగకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. దీంతో భయపడిన వైద్యురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.


More Telugu News