దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

  • మాజీ మంత్రికి హైకోర్టులో ఎదురుదెబ్బ
  • 2019లో జరిగిన విలేకరి హత్య కేసులో రాజాపై ఆరోపణలు
  • కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేసు నమోదు
విలేకరి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి దాడిశెట్టి రాజా దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. మంగళవారం పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. మాజీ మంత్రి పిటిషన్ ను తోసిపుచ్చింది. తుని నియోజకవర్గం తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేసిన కాతా సత్యనారాయణ 2019 అక్టోబర్ 15న హత్యకు గురయ్యారు. ఎస్. అన్నవరంలోని తన నివాసానికి వెళుతున్న సత్యనారాయణను లక్ష్మీదేవి చెరువుగట్టుపై దుండగులు అడ్డగించి, కత్తులతో నరికి చంపారు.

ఈ హత్యకు సూత్రధారి వైసీపీ నేత దాడిశెట్టి రాజానేనని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు తుని రూరల్ పోలీసులు రాజాతో పాటు ఆరుగురిని నిందితులుగా చేర్చి  కేసు నమోదు చేశారు. అయితే, రాజా మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ కేసు మరుగునపడిపోయింది. 2023లో మంత్రి పేరును ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్ లో  తొలగించారు. దీనిపై సత్యనారాయణ సోదరుడు, న్యాయవాది కాతా గోపాలకృష్ణ పట్టువదలకుండా పోరాడారు.

యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ను కలిసి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడ్డాక న్యాయం చేస్తామంటూ లోకేశ్ హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ప్రభుత్వం ఏర్పడ్డాక మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ దాడిశెట్టి రాజా హైకోర్టును ఆశ్రయించారు.


More Telugu News