పోలీసు ఇన్‌ఫార్మర్లు అనే అనుమానంతో ఇద్దరిని హ‌త‌మార్చిన‌ మావోయిస్టులు

  • తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో ఘ‌ట‌న‌
  • మృతులు ఉయికా రమేష్‌, ఉయికా అర్జున్‌గా గుర్తింపు
  • వీరిద్దరిపై పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపిన మావోయిస్టులు
తెలంగాణలోని ములుగు జిల్లాలో పోలీస్ ఇన్‌ఫార్మర్లు అనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు నరికి చంపారు. ఈ ఘటన గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీలో మావోయిస్టులు ఈ దారుణానికి పాల్పడ్డారు.

మృతులను స్థానికంగా నివాసం ఉంటున్న ఉయికా రమేష్‌, ఉయికా అర్జున్‌గా గుర్తించారు. రమేష్ అదే మండలంలోని పేరూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా ఉన్నారు. మావోయిస్టుల బృందం వీరిద్దరిపై పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు ఇద్దరూ త‌మ‌కు సంబంధించిన‌ సమాచారాన్ని సేకరిస్తున్నారని, మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్న రాష్ట్ర పోలీసు ఉన్నత సంస్థ అయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ)కి పంపుతున్నారని మావోయిస్టులు మృతదేహాల వ‌ద్ద‌ ఒక నోట్‌ను వదిలివెళ్లారు. ఈ నోట్‌పై సీపీఐ (మావోయిస్ట్‌) వాజేడు-వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత సంతకం ఉన్న‌ట్లు స‌మాచారం.

ఈ హత్యలకు బాధ్యత వహిస్తూ శాంత కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకప్పుడు తమకు కంచుకోటగా ఉన్న తెలంగాణలో తమ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాల నేప‌థ్యంలోనే ఈ హ‌త్య‌ జరిగింది.

గత 10-15 ఏళ్లుగా తెలంగాణలో మావోయిస్టుల ప్ర‌భావం దాదాపు కనుమరుగైందని, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికీ వారి ఉనికి ఉందని పోలీసులు చెబుతున్నారు.


More Telugu News