చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలా... కారణాలు, జాగ్రత్తలు ఇవిగో!

  • ఇటీవలి కాలంలో చాలా మందికి చిన్నవయసులోనే తెల్లబడుతున్న వెంట్రుకలు
  • 20, 25 ఏళ్ల వయసులో కూడా తెల్లబడటం మొదలు
  • కేవలం కాలుష్యమేగాక మరెన్నో కారణాలు ఉన్నాయంటున్న నిపుణులు
ఇటీవలి కాలంలో చాలా మందికి తక్కువ వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. 20, 25 ఏళ్ల వయస్సులోనే తెల్ల వెంట్రుకలు రావడం మొదలై... 40, 45 ఏళ్ల వయసుకల్లా జుట్టు నెరిసిపోతోంది. పురుషులతోపాటు మహిళల్లోనూ ఈ సమస్య కనిపిస్తోంది. చాలా మంది ఏదో కాలుష్యం వల్ల ఇలా అవుతోందనే భావనలో ఉంటున్నారు. కానీ చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటానికి చాలా కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వారసత్వంగా..
మీ అమ్మమ్మ, నానమ్మ, తాతలతోపాటు తల్లిదండ్రుల్లో ఎవరికైనా చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వచ్చి ఉంటే.. జెనెటికల్ గా పిల్లలకూ త్వరగానే వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు ముందే జాగ్రత్త పడి తగిన చిట్కాలు పాటిస్తే... కాస్త ఆలస్యంగా వచ్చేలా చూసుకోవచ్చు. 

శరీరంలో యాక్సిడేటివ్ స్ట్రెస్
జుత్తుపై నేరుగా ఎక్కువ సేపు ఎండ పడటం, దుమ్ము, ధూళి కాలుష్యం వంటివి శరీరంలో యాక్సిడేటివ్ స్ట్రెస్ ను పెంచుతాయి. దానితో జుట్టు త్వరగా తెల్లబడుతుంది.

విటమిన్ల లోపం...
శరీరానికి కావాల్సిన విటమిన్ బీ 12, ఐరన్, కాపర్, జింక్ వంటి పోషకాలు అందకపోతే.. వెంట్రుకల కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తి సరిగా జరగక జుత్తు తెల్లగా మారుతుంది.

హార్మోనల్ సమస్యలు
స్త్రీలలో యుక్త వయస్సుకు చేరడం, గర్భం దాల్చడం, మోనోపాజ్ దశ వంటి సమయాల్లో హార్మోన్లలో మార్పు వస్తుంది. ఈ హార్మోన్ల స్థాయులు సరిగా లేకుంటే.. తెల్ల వెంట్రుకలకు దారితీసే అవకాశం ఉంటుంది.

తీవ్ర మానసిక ఒత్తిళ్లు..
ఎవరైనా ఎక్కువకాలం తీవ్ర మానసిక ఒత్తిళ్ల మధ్య ఉంటే.. వారిలో కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు అధికంగా విడుదల అవుతాయి. అవి జుత్తుకు నలుపు రంగును ఇచ్చే మెలనోసైట్స్ తగ్గిపోయేందుకు దారి తీస్తాయి.

ధూమపానం అలవాటు..
ధూమపానం ఎక్కువగా చేసేవారిలో జుత్తు త్వరగా తెల్లబడుతుంది. సిగరెట్ల ద్వారా శరీరంలో చేరే విష పదార్థాలు మెలనిన్ ఉత్పత్తిని అడ్డుకోవడమే దీనికి కారణం.

విటిలిగో, థైరాయిడ్ సమస్యలు
విటిలిగో, ఇతర ఇమ్యూనిటీ డిజార్డర్లు ఉన్న వారిలో.. చర్మం, దానితోపాటు వెంట్రుకల రంగు మారిపోతుంది. థైరాయిడ్, రక్త హీనత సమస్యలు ఉన్నవారిలోనూ ఈ ప్రభావం కనిపిస్తుంది.

అతిగా షాంపూలు, బ్లీచింగ్...
తీవ్ర గాఢత ఉండే షాంపూలు, బ్లీచింగ్ ను అతిగా వాడటం, తరచూ జుత్తుకు రంగు వేయడం వంటివాటితో వెంట్రుకల కుదుళ్లు దెబ్బతింటాయి. మెలనోసైట్స్ సరిగా ఉత్పత్తికాక... తెల్ల జుట్టు వస్తుంది.


More Telugu News