ఐపీఎల్ లో అందరికంటే చిన్నోడు... 13 ఏళ్ల సూర్యవంశి

  • నేడు రెండో రోజు కొనసాగిన ఐపీఎల్ మెగా వేలం
  • వైభవ్ సూర్యవంశిని కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
  • ఇటీవల ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై సూర్యవంశి సూపర్ సెంచరీ
బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశి ఐపీఎల్ లో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లో ఆడనున్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశి రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించుకున్నాడు. సూర్యవంశి వయసు 13 ఏళ్లే. 

సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలం రెండో రోజున.... వైభవ్ సూర్యవంశిని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.1.10 కోట్లతో కొనుగోలు చేసింది. ఈ టీనేజి క్రికెటర్ కనీస ధర రూ.30 లక్షలు కాగా... ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ అతడిని దక్కించుకునేందుకు పోటీపడ్డాయి. అయితే, రూ.1.10 కోట్ల ధర వద్ద రాజస్థాన్ రాయల్స్ అతడిని సొంతం చేసుకుంది. 

వైభవ్ సూర్యవంశి బీహార్ లోని సమస్తిపూర్ కు చెందినవాడు. ఇటీవలే అంతర్జాతీయ సెంచరీ సాధించిన అత్యంత చిన్న వయసు బ్యాట్స్ మన్ గా రికార్డు నమోదు చేశాడు. ఆస్ట్రేలియా-19 జట్టుతో భారత అండర్-19 జట్టు చెన్నైలో ఆడిన యూత్ టెస్టులో సూర్యవంశి ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో 58 బంతుల్లోనే 100 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడా సెంచరీనే అతడికి ఐపీఎల్ లో కోటి రూపాయల కాంట్రాక్ట్ ను అందించింది.


More Telugu News