మున్సిపల్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక నిర్ణయాలకు ఆమోదం

  • డిసెంబర్ 31 నుంచి సింగిల్ విండో విధానం అమలు చేస్తున్నట్లు చెప్పిన మంత్రి నారాయణ
  • భవనాలు, లేఅవుట్ల అనుమతులను సులభతరం చేసినట్లు మంత్రి వెల్లడి
  • ఐదు అంతస్తుల వరకూ నిర్మాణాలకు లైసెన్సుడ్ సర్వేయర్ ద్వారా అనుమతులు ఇచ్చే విధానం ప్రవేశపెట్టినట్లు వెల్లడి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగంలో సంస్కరణల అమలుపై అధికారులు సమర్పించిన నివేదికలను సమీక్షించిన సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సమీక్ష అనంతరం మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. అధికారులు ఏడు బృందాలుగా పది రాష్ట్రాల్లో పర్యటించి ఆయా చోట్ల పట్టణ ప్రణాళిక విభాగాల్లోని ఉత్తమ విధానాలను ఈ నివేదికలో పొందుపరిచారని చెప్పారు. 

ఐదు అంతస్తుల వరకూ నిర్మాణాలకు లైసెన్సుడ్ సర్వేయర్ ద్వారా అనుమతులిచ్చే కొత్త విధానాన్ని మొదటి సారి ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. దీని వల్ల 95 శాతం మంది ప్రజలకు అనుమతుల కోసం పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల చుట్టూ తిరిగే బెడద తప్పుతుందన్నారు. భవనాలు, లేఅవుట్ల అనుమతులకు డిసెంబర్ 31 నుంచి సింగిల్ విండో విధానం అమలు చేయనున్నామని చెప్పారు. ఐదు అంతస్తుల భవనాలకు సంబంధించి సర్వేయర్‌లే స్వయంగా ప్లాన్ దరఖాస్తులను ఆన్‌లైన్ లో అప్‌లోడ్ చేసి రుసుము చెల్లించిన వెంటనే అనుమతులు వచ్చేలా ఏర్పాట్లు చేశామని, అయితే అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడితే సర్వేయర్ లైసెన్సు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెడతామన్నారు. 

రహదారుల విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారు అదే ప్రాంతంలో అదనపు అంతస్తులు నిర్మించుకోవడానికి ఇకపై టీడీఆర్ బాండు అవసరం లేదన్నారు. స్థలం కోల్పోయినట్లు అధికారుల ధ్రువీకరణ ఆధారంగా అనుమతిస్తారని చెప్పారు. వీరు వేరొక చోట చేపట్టే అదనపు అంతస్తుల నిర్మాణానికి టీడీఆర్ బాండు తప్పనిసరి అని తెలిపారు. 500 చదరపు అడుగులు దాటిన నివాస భవనాలకూ సెల్లార్ పార్కింగ్ అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనలకు సీఎం ఆమోదించారని చెప్పారు. 120 మీటర్ల కంటే ఎత్తయిన భవనాల సెట్ బ్యాక్ పరిమితిని 20 మీటర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. 

ఎత్తయిన భవనాల్లో పార్కింగ్ పోడియాన్ని 5 అంతస్తుల వరకూ అనుమతించామన్నారు. పది అంతస్తుల కంటే ఎత్తయిన భవనాల్లో రిక్రియేషన్ కోసం ఒక అంతస్తు ఉండేలా అనుమతులు ఇవ్వాలన్న ప్రతిపాదనలనూ సీఎం ఆమోదించారని మంత్రి తెలిపారు. ఇక నుంచి లేఅవుట్లలో 9 మీటర్ల  వెడల్పు రోడ్లు వదిలేలా వెసులుబాటు కల్పించామని తెలిపారు. 
.


More Telugu News