నేటి నుంచి కొల్లాపూర్‌ ఆర్ఐడీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు.. ప్రముఖుల రాక

  • ఆర్ఐడీ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముస్తాబైన కొల్లాపూర్
  • నేటి నుండి మూడు రోజుల పాటు వేడుకలు
  • ముఖ్య అతిధులుగా హజరుకానున్న డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సినీ హీరో దేవరకొండ తదితరులు
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌ పూర్వ విద్యార్దుల సమ్మేళనం అట్టహాసంగా మొదలైంది. పట్టణంలో 1930లో స్థాపించిన రాణి ఇందిరా దేవి పాఠశాల, 1979లో ఏర్పాటు చేసిన రాణి ఇందిరా దేవి బాలుర కళాశాల (ఆర్ఐడీ) గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పూర్వ విద్యార్ధుల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ విద్యాసంస్థతో అనుబంధం ఉన్న విద్యార్ధులు అందరూ ఒక్క చోట కలవబోతున్నారు. దాదాపు రెండు వేల మంది పూర్వ విద్యార్ధులు ఈ కార్యక్రమానికి హజరవుతారు. 

గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఈ రోజు (27వ తేదీ నుంచి 29వ వరకూ) బుధవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు, సినీ హీరో దేవరకొండ, ప్రముఖ వాగ్గేయకారులు దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, అందెశ్రీ, జయరాజు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఇండియన్ ఐడీఎల్ టీమ్ సభ్యులు హజరుకానున్నారని ఆర్ఐడీ స్వర్ణోత్సవాల నిర్వహకులు తెలిపారు. 
 
ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బుధవారం (27వ తేదీ) ముఖ్య అతిధులతో పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. అనంతరం స్వర్ణోత్సవ సీడీ విడుదల, ముఖ్య అతిధుల ప్రసంగం వుంటాయి. మధ్యాహ్నం ఆర్ఐడీ అవార్డు బ్యాచ్‌ల వారీగా పరిచయ కార్యక్రమం, వాగ్గేయకారులతో ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతుంది. రాత్రి హరికథ టీమ్ సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

రేపు (28వ తేదీ) ఉదయం సినిమా హీరో విజయ్ దేవరకొండ ఆర్ఐడీ పూర్వ విద్యార్ధులతో పట్టణంలో ప్రభాత భేరీ నిర్వహించనున్నారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం, పట్టణంలో పునర్నిర్మాణం చేసిన ఆర్ఐడీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ పైలాన్ ఆవిష్కరణ చేస్తారు. 

29వ తేదీ చివరి రోజు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌లు హజరు కానున్నారు. స్వర్ణోత్సవాలను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని సురభిరాజా బంగ్లాలో సినిమా సెట్టింగ్‌లతో కూడిన ఏర్పాట్లు చేశారు. 


More Telugu News