ఐపీఎల్ వేలంలో అనూహ్య‌మైన ధ‌ర‌.. రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులైన యువ ఆట‌గాళ్లు వీరే!

  • ఈసారి ఐపీఎల్ వేలంలో పెద్దగా పేరు లేని కొంతమంది యువ ఆట‌గాళ్లకు ఊహించ‌ని ధ‌ర‌
  • దాంతో యంగ్ ప్లేయర్స్ ఓవ‌ర్‌నైట్‌లో కోటీశ్వరులైన వైనం
  • ఈ జాబితాలో రసిక్‌ సలాం, అల్లా గ‌జ‌న్‌ఫ‌ర్‌, ప్రియాంశ్‌ ఆర్య, అశుతోశ్ శ‌ర్మ‌  
ఈసారి ఐపీఎల్ వేలంలో పెద్దగా పేరు లేని కొంతమంది యువ ఆట‌గాళ్లు అనూహ్య‌మైన ధ‌ర‌ దక్కించుకుని రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుల‌య్యారు. ఫ్రాంచైజీలు పోటీప‌డి మ‌రీ వారిపై కోట్లు గుమ్మ‌రించాయి. దాంతో యంగ్ ప్లేయర్స్ ఓవర్నైట్‌లో కోటీశ్వరులైపోయారు. ఇలా ఊహించ‌ని ధ‌ర ప‌లికిన కొంద‌రు యువ ఆట‌గాళ్లు, వారిని ద‌క్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఎంతెంత చెల్లించాయి వంటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 

రసిక్‌ సలాం..
ఎమ‌ర్జింగ్‌ ఆటగాళ్ల ఆసియా కప్‌లో ఈ 18 ఏళ్ల ఈ పేస‌ర్‌ త‌న‌దైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు ప‌డ‌గొట్టాడు. అయితే వయసు ధ్రువపత్రంలో తప్పిదం కారణంగా 2019లో రసిక్‌పై రెండేళ్ల నిషేధం ప‌డింది. ఇప్పుడు పునరాగమనంలో బాగా రాణిస్తుండ‌డం అత‌నికి బాగా క‌లిసొచ్చింది. దాంతో ఈసారి వేలంలో ఏకంగా రూ.6 కోట్లు వెచ్చించి ఆర్‌సీబీ కొనుగోలు చేసింది.

అల్లా గ‌జ‌న్‌ఫ‌ర్‌..  
ఆఫ్ఘ‌నిస్థాన్‌కు చెందిన అల్లా గ‌జ‌న్‌ఫ‌ర్‌ వయసు కేవలం 18 ఏళ్లే. ఈ యువ ఆట‌గాడు ఆ దేశానికే చెందిన బౌల‌ర్‌ రషీద్లానే మరో మిస్టరీ స్పిన్నర్‌. ఇటీవ‌లే అంత‌ర్జాతీయ‌ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఇతడు, తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 6 వికెట్ల తీసి అదరగొట్టాడు. 

దాంతో ఈసారి వేలంలో అతడి కోసం గట్టి పోటీ నెలకొంది. చివరికి ముంబయి ఇండియన్స్ రూ.4.8 కోట్లకు ఇత‌డిని ద‌క్కించుకుంది. ఐపీఎల్‌ వేలంలో మొదటిసారి తన పేరును నమోదు చేసుకున్నా అల్లా గ‌జ‌న్‌ఫ‌ర్ ఇలా భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయి అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు.

ప్రియాంశ్‌ ఆర్య..
చిచ్చ‌ర‌పిడుగు ప్రియాంశ్‌ ఆర్య ఇటీవ‌ల ఢిల్లీ ప్రిమియర్ లీగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది తన పేరు మార్మోగేలా చేశాడు. ఇదే టోర్నీలోని మరి కొన్ని మ్యాచుల్లోనూ అద్భుతంగా రాణించాడు. దీంతో ఈ హార్డ్‌ హిట్టర్ కోసం గ‌ట్టి పోటీ నెలకొంది. ఆఖ‌రికి పంజాబ్‌ కింగ్స్‌ రూ. 3.8 కోట్లకు ఆర్య‌ను కొనుగోలు చేసింది.

అశుతోశ్ శ‌ర్మ‌.. 
2024 ఐపీఎల్‌ సీజన్ చివర్లో పంజాబ్‌ కింగ్స్‌ కొన్ని విజయాలు సాధించడంలో శశాంక్‌ సింగ్‌తో పాటు అశుతోశ్‌ శర్మ కీలకంగా వ్యవహరించాడు. గ‌త సీజ‌న్‌లో పంజాబ్ త‌ర‌ఫున‌ 11 మ్యాచులు ఆడిన అశుతోశ్ ఏకంగా 167 స్ట్రైక్ రేట్‌తో 189 ర‌న్స్ బాదాడు. దీంతో వేలంలో అశుతోశ్‌కు ఈసారి భారీ ధ‌ర ప‌లికింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ అత‌డి కోసం ఏకంగా రూ.3.8 కోట్లు వెచ్చించింది.

గుర్జన్ సింగ్..
చాలా ఎత్తుగా ఉండే ఈ ఎడ‌మ‌చేతి వాటం పేస‌ర్‌ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో దిండిగల్‌ జట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఈ సీజన్‌లో ఆ జ‌ట్టు టైటిల్ గెల‌వ‌డంలో గుర్జన్‌ కీలకంగా వ్యవహరించాడు. అలాగే ఈ పొడగరి ఫాస్ట్‌ బౌలర్‌ దేశవాళీ క్రికెట్‌లోనూ నిలకడగా రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు. మంచి స్పీడ్‌తో బంతులు విస‌ర‌గల ఈ ఫాస్ట్ బౌల‌ర్‌ను చెన్నై సూపర్‌ కింగ్సే రూ.2.2 కోట్లకు కొనుగోలు చేసింది. 

ఇషాన్‌ మలింగ..
ఐపీఎల్‌ ఆల్‌ టైం గ్రేట్‌ బౌలర్లలో ఒకడు లసిత్‌ మలింగ. ఇప్పుడు అతని పేరుకి దగ్గరగా వుండే మరో టాలెంట్ పేసర్‌ లంక క్రికెట్లో అద‌ర‌గొడుతున్నాడు. అతడే ఇషాన్‌ మలింగ. ఇటీవ‌ల దేశ‌వాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగానూ నిలిచాడు. అయితే, ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. ఇతడిని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.1.2 కోట్లకు దక్కించుకుంది. 


More Telugu News