హార్దిక్ పాండ్యా వీరబాదుడు

  • సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ–2024లో హార్దిక్ పాండ్యా దూకుడు 
  • కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెలరేగిన ఆల్‌రౌండ‌ర్‌ 
  • 30 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 69 పరుగులు బాదిన పాండ్యా
సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ 2024లో బరోడా టీమ్ వ‌రుస‌ విజయాలతో దూసుకెళ్తోంది. బుధవారం ఇండోర్ స్టేడియంలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో బరోడా గెలిచింది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించి థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. 

ఆల్‌రౌండ‌ర్‌ హార్దిక్ పాండ్యా దూకుడు బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆరవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పాండ్యా .. ప్రత్యర్ధి బౌలర్లకు చెమటలు పట్టించాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తం 30 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 69 పరుగులు బాదాడు.
 
హార్దిక్‌తో పాటు భాను పానియా 42 పరుగులతో రాణించాడు. దీంతో బరోడా టీమ్ ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బౌలర్లలో మెరివాలా మూడు వికెట్లు పడగొట్టగా, మహేశ్ పతియా, వినాంద్ రత్వా త‌లో వికెట్ తీశారు. 

తమిళనాడు టీమ్ బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి 3, సాయి కిశోర్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్ నారాయణ్ జగదీశన్ హాఫ్ సెంచరీ (57), విజయ్ శంకర్ (42), షారూఖ్ ఖాన్ (39) పరుగులతో రాణించారు.  


More Telugu News