డ్రగ్స్ నియంత్రణకు 'ఈగల్'ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

  • అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాల ఏర్పాటు
  • డ్రగ్స్ సరఫరా, నియంత్రణపై దర్యాఫ్తు చేయనున్న ఈగల్
  • సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకోవాలని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ నియంత్రణకు 'ఈగల్‌'ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈగల్‌కు సంబంధించి అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై ఈగల్ దర్యాఫ్తు చేయనుంది. ఈగల్ కోసం సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈగల్ ఫోర్స్‌లో చేరిన వారికి 30 శాతం ప్రత్యేక అలవెన్స్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అలాగే, డ్రగ్స్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు 5 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై హైకోర్టుకు నివేదించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈగల్ ఫోర్స్ కోసం రూ.8.59 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది.


More Telugu News