వెనుక ఏదో కుట్ర జరుగుతున్నట్లుగా ఉంది.. నేనెక్కడికీ పారిపోలేదు: 22 పాయింట్లతో రాంగోపాల్ వర్మ ట్వీట్

  • ఇప్పటి వరకు పోలీసులు తన ఆఫీస్‌లో కాలు పెట్టలేదన్న రాంగోపాల్ వర్మ
  • నాలుగైదు రోజుల్లోనే నాపై 9 కేసులు నమోదయ్యాయన్న ఆర్జీవీ
  • పోలీసులు వెతుకుతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదన్న ఆర్జీవీ
తన మీద ఒకేసారి వివిధ జిల్లాల్లో కేసులు నమోదవడం చూస్తుంటే కుట్ర జరుగుతున్నట్లుగా కనిపిస్తోందని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అనుమానం వ్యక్తం చేశారు. తనపై కుట్ర జరుగుతుందనిపించడం వల్లే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన 22 పాయింట్లతో ఎక్స్ వేదికగా సుదీర్ఘ ట్వీట్ చేశారు. తాను ఎవరినీ నిందించడం లేదు కానీ నా వెనుక ఏదో జరుగుతోందని మాత్రం అర్థమవుతోందని పేర్కొన్నారు.

నా కేసు-ఆర్జీవీ అంటూ చేసిన ఈ ట్వీట్‌లో తనపై నమోదైన కేసులు, సెక్షన్లను వివరిస్తూ... అది తనకు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. అలాగే ప్రచారం జరుగుతున్నట్లుగా తాను ఎక్కడికీ పారిపోలేదన్నారు. నా డెన్‌లోనే ఉన్నానని తెలిపారు. పోలీసులు కూడా తనను అరెస్ట్ చేయడానికి రాలేదని తెలిపారు.

అర్జీవీ చేసిన ట్వీట్లు ఇవే... 

1. నేనేదో పరారీలో ఉన్నాను, మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఈ టైమ్ అంతా నేను నా డెన్ ఆఫీసులోనే ఉన్నాను. అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకు వెళ్లాను.

2. ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇప్పటి వరకు నా ఆఫీసులోకి కాలు కూడా పెట్టలేదు. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు. ఒకవేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసులోకి ఎందుకు రారు?

3. నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టానని అంటున్న కొన్ని మీమ్స్ గురించి నా మీద కేసు అంటున్నారు. ఇప్పుడు సడెన్‌గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినటం మూలన ఆ కంప్లయింట్ ఇచ్చారంట.

4. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే నలుగురు వేర్వేరు వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు వేర్వేరు జిల్లాల్లో నా మీద ఈ కేసు పెట్టారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదయ్యాయి. అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు. ఇవన్నీ కూడా కేవలం గత 4, 5 రోజుల్లోనే నమోదయ్యాయి. 

5. నాకు నోటీసు అందిన వెంటనే, నా సినిమా పనుల కారణంగా సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగింది. ఆయన కూడా అనుమతించారు. కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడిగాను. లేదంటే వర్చువల్‌గా హాజరవుతానని కూడా తెలియజేశాను. అదే టైమ్‌లో నా మీద అన్ని వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదవ్వడం వెనక ఏదో కుట్ర ఉందని కూడా నాకు, నా వాళ్ళకి అనుమానం కలిగింది. 

6. నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాను. చాలాసార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా చేసేవాడిని. ఒక సంవత్సరకాలంలో కొన్ని వేల పోస్టులు చేసి ఉంటాను. వాళ్ళు నేను పెట్టానంటున్న  పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రంకు సంబంధించినవి. ఆ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం ఆ చిత్రం విడుదల అవ్వడం కూడ చాలా నెలల క్రితం జరిగిపోయింది.

7. నేను పెట్టిన ఏ పోస్టుల వల్ల... వేర్వేరు ప్రాంతాల్లో మనోభావాలు దెబ్బతిన్నాయని అంటున్నారు.

8. ఈ మీమ్స్ కారణంగా నా మీద 336 (4), 353 (2), 356 (2), 61 (2), 196, 352 of BNS and section 67 of IT సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయబడ్డాయి. 

9. BNS 336(4) అంటే... ఏవైనా పత్రాలను కానీ, ఎలక్ట్రానిక్ రికార్డును కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం.

నేను చేసిన పోస్టులను చూస్తే, అందులో ఫోర్జరీ ఎక్కడుంది? అది కేవలం ఒక కార్టూన్. ఒకవేళ దీని వల్ల ఒకరి పరువుకు భంగం కలిగిందంటే కనుక కొన్ని లక్షలమంది ఇంకొన్ని లక్షల మంది మీద పెడుతున్న పోస్టుల సంగతేమిటి?  

10. BNS 353(2) అంటే... తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశమున్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా, మతం, జాతి ప్రాతిపదికన ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం, వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం.

నా కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు.

11. BNS 356. (1) అంటే... ఎవరైనా మాటల ద్వారా గానీ, రాతల ద్వారా గానీ, సంకేతాల ద్వారా గానీ, చిహ్నాల ద్వారా గానీ ఒకరి పరువుకు నష్టం కలిగించడం. మీమ్‌లతో పరువునష్టం దావాలు వేస్తే రోజుకు లక్ష కేసులు అవుతాయి.

12. BNS 61(2) అంటే... ఒక చట్ట విరుద్ధమైన పని చేయడం కోసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది మధ్య జరిగే ఒప్పందం. ఇక: మోసపూరిత విధానంలో చద్దబద్ధమైన ఫలితం పొందడం. ఇది నా కేసుకు లింకేంటి?

13. BNS 196... అంటే వేర్వేరు గ్రూపుల మధ్య మతం, ప్రాంతం, జన్మస్థలం, నివాస ప్రదేశం మొదలైన వాటి ప్రాతిపదికన విద్వేషం సృష్టించడం, శాంతికి భంగం కలిగేలా చేయడం. 

14. సెక్షన్ 67 ఐటీ యాక్ట్... అంటే ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించబడిన లేదా ప్రసారం చేసిన లేదా ప్రసారం చేయడానికి కారణమయ్యే ఎవరైనా, కామాంతమైన లేదా ప్రేక్షక ఆసక్తిని ఆకర్షించటం. సెక్షన్ 67 కేవలం అసభ్యకర విషయాల్ని సృష్టించిన లేదా వ్యాప్తి చేసిన నేరం. 

ఒక వ్యంగ్య చిత్రంలో అసభ్యకరం ఏముంటుంది?

15. నా సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయబడిందని చెప్పబడుతున్న విషయం, భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)a
ప్రకారం న్యాయబద్ధమైనది. దీని ప్రకారం ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను, ఆలోచనలను స్వేచ్ఛగా తెలియజేయవచ్చు. ఇది కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు.. రాతల ద్వారా... చిత్రాల ద్వారా... సినిమాల ద్వారా... పోస్టర్ల ద్వారా కూడా అవ్వచ్చు.

16. ప్రతి ప్రజాస్వామ్య సమాజంలో మూలస్తంభం వాక్ స్వాతంత్రం. దాని ప్రథమ లక్షణం, ఒక వ్యక్తి తన దగ్గరున్న సమాచారాన్ని ఓపెన్‌గా మాట్లాడగలగడం. అదే విధంగా ఇతరుల నుండీ ఏ విధంగానైనా వచ్చే వాటినీ స్వీకరించటం. ఇది స్వేచ్చ యొక్క ప్రధాన హక్కు. ఈ హక్కును నిర్మూలించడం లేదా హద్దులు నిర్ణయించడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం.

17. ఈ మీమ్ అనే భావప్రకటన ప్రస్తుత సమాజంలో తమ ఆలోచనలను, భావాలను, ఉద్దేశాలను, శైలిని, ప్రవర్తనలు వ్యక్తపరిచే ఎఫెక్టివ్ సాధకం. విస్తృతంగా వ్యాపిస్తూ పరిణామం చెందే లక్షణం వల్ల ఈ మీమ్స్ డిజిటల్ కల్చర్‌లో ముఖ్య భాగమైంది. మీమ్స్ అనేవి ఇమేజ్, వీడియో లేదా వాక్యము తదితర రూపంలో ఉండే హాస్యభరితమైన మెసేజ్ మాత్రమే.

18. మనం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే సినిమా మనుషులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం అందరూ ప్రతి రోజు ఈ సోషల్ మీడియాలో తమ ఉద్దేశాలను రుద్దుతూ, జోక్స్ వేసుకుంటూ, అరుచుకుంటూ, బూతులు తిట్టుకుంటూ, బోధనలు చేస్తుంటారు. ఇప్పుడు వీటన్నింటినీ  సీరియస్‌గా తీసుకుంటే దేశంలో సగంమంది పైన కేసు పెట్టాలి.

19. ప్రస్తుతం నా కేసు గురించి మాట్లాడితే, నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను పోలీసుల విచారణకు హాజరు కావటానికి ఇంకొంత సమయం కావాలని లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనటానికి అనుమతి కావాలని విజ్ఞప్తి చేస్తూ లెటర్ పంపిన 30 నిమిషాలలో పోలీసులు నా ఆఫీసుకు వచ్చారు. కానీ వాళ్ళు నా ఆఫీసు లోపలకి రాలేదు. నన్ను అరెస్టు చేయటానికి వచ్చామని కూడా చెప్పలేదు.

20. ఇప్పటికీ మీడియాలో వస్తున్న కథనాలు... నన్ను పట్టుకోవటానికి పోలీసులు టీమ్స్ ఏర్పరిచారని... వాళ్ళు ముంబై, చెన్నై ఇంకా పలుచోట్ల వెతుకుతున్నారని... నేను పరారీలో ఉన్నానని. కానీ ఇవన్నీ అబద్ధాలు. ఈ మీడియా ప్రతిసారి లాగే హైడ్రామా క్రియేట్ చేసింది.

21. లెక్కలేనన్ని మీడియా కాల్స్, ఇంకా పరామర్శ కాల్స్ రావడం వల్ల నేను నా మొబైల్ ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశాను. ఎందుకంటే ఇవన్నీ నా పనిని డిస్టర్బ్ చేస్తాయి. ఇప్పటి వరకు నేను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ టైమ్‌కి నాకు ఆఫీసర్ల నుండి ఎలాంటి సమాధానం రాలేదు. నా మీద ఒకేసారి వివిధ జిల్లాలో కేసులు నమోదవటం అనేది ఏదో కుట్ర జరుగుతుందనిపించింది. అందుకే నేను ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశాను. కానీ నేను వాస్తవాలు తెలియకుండా ఒక వ్యక్తిని లేక ఒక గ్రూప్‌ని నిందించటం లేదు, కానీ వెనుక ఏదో జరుగుతుందని మాత్రం అర్థమవుతోంది.

22. నేను చట్టాన్ని గౌరవిస్తాను.. అలాగే ప్రభుత్వ  సంస్థల నియమ నిబంధనలును కచ్చితంగా పాటిస్తాను. కాని దాంతో పాటు రాజ్యాంగ పరిధిలో చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కును వినియోగించుకుంటాను.
ఎప్పటి లాగే మీడియా సొంతంగా ఒక కథ రాసుకుని అందులో నన్ను సెంట్రల్ కేరక్టర్‌గా చేసి ఒక సినిమా తీసింది. నాకు కూడా వాళ్ళకున్నంత టాలెంట్ ఉండి ఉంటే ఎంత బాగుండేదో?


More Telugu News