షిండేకు మొండిచెయ్యి.. బీజేపీకే ‘మహా’ సీఎం పోస్ట్

  • అమిత్‌షాతో గతరాత్రి ‘మహాయుతి’ నేతల సమావేశం
  • డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు షిండే నిరాకరణ
  • తన కుమారుడు శ్రీకాంత్‌కు ఆ పదవి ఇవ్వాలని డిమాండ్
  • కీలకమైన 12 మంత్రి పదవులు కావాలని పట్టు
  • ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను కొనసాగించనున్న బీజేపీ
  • నేడు ముంబైలో మరోమారు భేటీ
మహారాష్ట్ర సీఎం ఎవరన్న దానిపై దాదాపు ఓ స్పష్టత వచ్చేసింది. బీజేపీ నేతకే ఈ పోస్టు దక్కబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుత కేర్‌టేకర్ సీఎం ఏక్‌నాథ్‌షిండేకు డిప్యూటీ సీఎం పదవిని బీజేపీ ఆఫర్ చేయగా, అందుకు ఆయన నిరాకరించినట్టు తెలిసింది. గత రాత్రి మహాయుతి నేతలతో సమావేశమైన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రతిష్టంభనకు తెరదించినట్టు తెలిసింది. అలాగే, కేబినెట్ బెర్త్‌ల కేటాయింపుపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. కొత్త కేబినెట్‌లో తమకు కనీసం 12 కీలక మంత్రి పదవులు కావాలని షిండే డిమాండ్ చేసినట్టు సమాచారం.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నేత అజిత్ పవార్ సహా మహాయుతి నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మీటింగ్ సానుకూలంగా జరిగినట్టు షిండే తెలిపారు. సీఎం ఎవరన్నది తేల్చేందుకు ముంబైలో నేడు (శుక్రవారం) మరోమారు సమావేశం కానున్నట్టు చెప్పారు. కాగా, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను ఈసారి కూడా కొనసాగించాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలిసింది.

దేవేంద్ర ఫడ్నవీస్‌కు సీఎం పోస్టు దాదాపు ఖాయమైన నేపథ్యంలో, డిప్యూటీ సీఎం పదవిని నిరాకరిస్తున్న షిండే.. తన కుమారుడు శ్రీకాంత్‌కు ఆ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. అలాగే, హోం మంత్రిత్వశాఖతోపాటు పట్టాణాభివృద్ధి శాఖను కూడా శివసేనకే కేటాయించాలని కోరినట్టు సమాచారం. అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పోస్టుతోపాటు ఆర్థిక, మైనారిటీ వ్యవహారాలు, మహిళా, శిశు సంక్షేమశాఖలు దక్కే అవకాశం ఉంది. 


More Telugu News