కాకినాడ పోర్టు నుంచి అక్రమ రవాణాపై ప్రధాని మోదీకి లేఖ సిద్ధం చేయండి: పవన్ కల్యాణ్ ఆదేశాలు

  • కాకినాడ పోర్టు నుంచి అక్రమ రవాణా జరుగుతోందన్న పవన్
  • పోర్టు నుంచి అక్రమ రవాణా తీవ్రమైన అంశం అని వెల్లడి
  • ఉగ్రవాదులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన 
కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని కూటమి నేతలు గత ప్రభుత్వ హయాం నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో... కాకినాడ పోర్టు అంశంపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించారు. కాకినాడ పోర్టు అక్రమ రవాణా చాలా తీవ్రమైన అంశం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 

కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ రవాణా కార్యకలాపాలపై ప్రధాని మోదీకి, రాష్ట్ర హోంమంత్రి అనితకు, దర్యాప్తు సంస్థలకు లేఖలు సిద్ధం చేయాలని తన వ్యక్తిగత కార్యదర్శిని ఆదేశించారు. ఇక్కడ ఎన్నో జాతీయ సంస్థలు, పెద్ద కంపెనీలు ఉన్నాయని... అక్రమ రవాణా మార్గాల్లో ప్రమాదకర శక్తులు వస్తే ఆయా సంస్థలు, కంపెనీల రక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అని, తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే అది దేశ భద్రతకే భంగం కలిగిస్తుందని వివరించారు. అక్రమ రవాణా చేస్తున్న బోటు ఓనర్లు, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు, దీని వెనకున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని, ఈ మొత్తం వ్యవహారం వెనకున్న కింగ్ పిన్ లను గుర్తించాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

"పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు అక్రమ రవాణా జరగవని గ్యారంటీ ఏంటి? ఈ అక్రమ మార్గాల్లో కసబ్ వంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం ఉండదా? దీనిపై జిల్లా ఎస్పీ వెంటనే స్పందించాలి" అని పవన్ పేర్కొన్నారు.


More Telugu News