మూడు నెలలు అన్నం కూడా తినలేదు.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: రాజేంద్రప్రసాద్

  • కెరీర్ ఆరంభంలో అవకాశాలు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానన్న రాజేంద్రప్రసాద్
  • డబ్బింగ్ ఆర్టిస్టుగా తన ప్రయాణం మొదలయిందని వెల్లడి
  • వంశీ సినిమాల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నానన్న రాజేంద్రప్రసాద్
తన కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలను అనుభవించానని సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ చెప్పారు. చేతిలో డబ్బుల్లేక దాదాపు మూడు నెలలు అన్నం కూడా తినలేదని తెలిపారు. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు. 

ఇంజినీరింగ్ పూర్తి చేసిన వెంటనే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని రాజేంద్రప్రసాద్ తెలిపారు. స్కూల్ టీచర్ అయిన తన తండ్రి ఎంతో స్ట్రిక్ట్ గా ఉండేవారని... తాను సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నానని చెపితే అసహనం వ్యక్తం చేశారని చెప్పారు. నీ ఇష్టానికి వెళ్తున్నావు... సినిమాల్లో ఫెయిల్ అయితే ఇంటికి రావద్దని అన్నారని తెలిపారు. ఆయన మాటలు తనపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పారు. 

ఆ తర్వాత తాను మద్రాస్ వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరానని... గోల్డ్ మెడల్ సాధించానని తెలిపారు. అయితే సినిమా అవకాశాలు మాత్రం రాలేదని చెప్పారు. ఇంటికి తిరిగి వెళ్తే... రావద్దన్నాను కదా ఎందుకు వచ్చావని నాన్న అన్నారని... ఎంతో బాధతో వెంటనే మద్రాస్ కు వచ్చానని తెలిపారు.  

ఒకరోజు నిర్మాత పుండరీకాక్షయ్య ఆఫీసుకు వెళ్తే... అక్కడ ఏదో గొడవ జరుగుతోందని... తన రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆయన తనను డబ్బింగ్ థియేటర్ కు తీసుకెళ్లారని... ఒక సీన్ కు తనతో డబ్బింగ్ చెప్పించారని... అది ఆయనకు బాగా నచ్చడంతో రెండో సీన్ కు డబ్బింగ్ చెప్పించారని తెలిపారు. అలా తన డబ్బింగ్ ప్రయాణం మొదలయిందని... మద్రాస్ లో ఇల్లు కట్టుకున్నానని చెప్పారు. ఆ తర్వాత దర్శకుడు వంశీతో పరిచయం కావడం... ఆయన సినిమాలలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నానని అన్నారు.




More Telugu News